రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు
ఏటా రూ.60 లక్షలకు పైగా నిర్వహణ వ్యయం
పైసా ఆదాయం లేదు..
పర్యాటకుల ఆదరణ లేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కొంతకాలంగా ‘తెల్ల ఏనుగుల’ను మేపుతోంది. వాటి కోసం రూ.లక్షలు వెచ్చిస్తోంది. రూపాయి ఆదాయం లేదు. ఆదరించే పర్యాటకులు లేరు. పైగా వాటి నిర్వహించేందుకు కచ్చితమైన ప్రణాళికలు కూడా లేవు. దీంతో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ ‘తెల్ల ఏనుగులు’ హెచ్‌ఎండీఏకు గుదిబండగా మారాయి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులే ఆ తెల్ల ఏనుగులు. అలనాటి డబుల్ డెక్కర్ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వీటిని ప్రవేశపెట్టారు. ఒక్కో బస్సు కోసం రూ.2.16 కోట్ల చొప్పున సుమారు రూ.12.96 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. రూట్లు, బస్సుల నిర్వహణ వంటి అంశాలపైన ఎలాంటి స్పష్టత లేకుండా అప్పటి ఫార్ములా–ఈ పోటీలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కొనుగోలు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు అలంకారప్రాయంగా మారాయి.
‘గమ్యం’ చేరని బస్సులు
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడిపింది. సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం, కోఠీ, జూపార్కు తదితర రూట్లలో ఈ బస్సులు తిరిగాయి. అతిపెద్ద ప్రజారవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీకి మాత్రమే ఈ బస్సుల నిర్వహణ సాధ్యమైంది. క్రమంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, ఎలివేటెడ్ కారిడార్‌లు వంటివి అందుబాటులోకి రావడంతో డబుల్ డెక్కర్‌ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్లను నిలిపివేసింది. కానీ డబుల్ డెక్కర్ బస్సులకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ ఈ బస్సులను కొనుగోలు చేయడం మంచిదే అయినా. ప్రజా రవాణా రంగంతో ఎలాంటి సంబంధం లేని హెచ్‌ఎండీఏ సంస్థే ఈ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.
దీంతో ఏడాది కాలంగా ఈ బస్సుల నిర్వహణ గమ్యం లేని ప్రయాణంలా మారింది. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణాన్ని అందజేస్తూ ఈ బస్సులు ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్నింటిని సాలార్‌జంగ్ మ్యూజియం, వేవ్‌రాక్స్ వరకు నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు. కానీ అందులో స్పష్టత లేదు. ప్రయాణికులు లేక వెలవెలాపోతూ ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రం ట్యాంక్‌బండ్ చుట్టూ మాత్రం కనిపిస్తున్నాయి. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు వీటిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. కా నీ ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు తక్కువే.
ఆర్టీసీకి అప్పగిస్తేనే మేలు...
నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ 2003 వరకు నడిపింది. ప్రయాణికులను, పర్యాటకులను అప్పట్లో ఇవి విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరిగి అదేవిధంగా ప్రయాణికుల ఆదరణతో పాటు ఆదాయం కూడా లభించాలంటే ఈ బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తే బాగుంటుందని రవాణారంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డిపోల్లో విద్యుత్ చార్జింగ్ సదుపాయం ఉంది. పైగా అన్ని రూట్‌లపైన సమగ్రమైన అధ్యయనం చేసి శాస్త్రీయమైన పద్ధతిలో ఈ బస్సులను నడిపే సమర్ధత కేవలం ఆరీ్టసీకే ఉంటుంది.ఈ బస్సులకు ఒక సారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. కేవలం రెండున్నర గంటల్లో చార్జింగ్ పూర్తవుతుంది.
ఏడాదిలో రూ.60.43 లక్షలు..
ఈ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలని గతంలో ప్రతిపాదించారు. కానీ అందుకు భిన్నంగా హెచ్‌ఎండీఏ వీటి నిర్వహణ బాధ్యతలను అహ్మదాబాద్‌కు చెందిన ఎస్‌ఆర్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు అప్పగించింది.ఈ బస్సుల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ఆపరేషన్స్, మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) కోసం ఏటా హెచ్‌ఎండీఏ ప్రతి నెలా రూ..5,03,585 చొప్పున ఖర్చు చేస్తోంది. ఏటా రూ.60.43 లక్షల వరకు వెచ్చిస్తోంది.
ఈ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 66 మందికి సీటింగ్ సదుపాయం ఉంది. కానీ టూరిస్ట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నడుపుతున్న ఈ బస్సుల్లో పట్టుమని పది మంది కూడా ప్రయాణం చేయకపోవడం గమనార్హం.
హెచ్‌ఎండీఏ అధికారుల నుంచి లభించిన వివరాల మేరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్, పీవీఎన్‌ఆర్ మార్గ్, ఖైరతాబాద్, నాంపల్లి రూట్‌లో 20 ట్రిప్పులు తిరుగుతున్నాయి.
ఇక సెక్రటేరియట్ నుంచి సాలార్‌జంగ్‌మ్యూజియం వరకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సెక్రటేరియట్–వేవ్‌రాక్స్ వరకు తిరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. కానీ ఈ రెండు రూట్లలో ఈ బస్సులు కనిపించకపోవడం గమనార్హం.


