breaking news
double-decker bus
-
కోట్లు పెట్టి కొన్నారు.. లక్షలు పెట్టి మేపుతున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొంతకాలంగా ‘తెల్ల ఏనుగుల’ను మేపుతోంది. వాటి కోసం రూ.లక్షలు వెచ్చిస్తోంది. రూపాయి ఆదాయం లేదు. ఆదరించే పర్యాటకులు లేరు. పైగా వాటి నిర్వహించేందుకు కచ్చితమైన ప్రణాళికలు కూడా లేవు. దీంతో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ ‘తెల్ల ఏనుగులు’ హెచ్ఎండీఏకు గుదిబండగా మారాయి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులే ఆ తెల్ల ఏనుగులు. అలనాటి డబుల్ డెక్కర్ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వీటిని ప్రవేశపెట్టారు. ఒక్కో బస్సు కోసం రూ.2.16 కోట్ల చొప్పున సుమారు రూ.12.96 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. రూట్లు, బస్సుల నిర్వహణ వంటి అంశాలపైన ఎలాంటి స్పష్టత లేకుండా అప్పటి ఫార్ములా–ఈ పోటీలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కొనుగోలు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు అలంకారప్రాయంగా మారాయి. ‘గమ్యం’ చేరని బస్సులు హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడిపింది. సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం, కోఠీ, జూపార్కు తదితర రూట్లలో ఈ బస్సులు తిరిగాయి. అతిపెద్ద ప్రజారవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీకి మాత్రమే ఈ బస్సుల నిర్వహణ సాధ్యమైంది. క్రమంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, ఎలివేటెడ్ కారిడార్లు వంటివి అందుబాటులోకి రావడంతో డబుల్ డెక్కర్ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్లను నిలిపివేసింది. కానీ డబుల్ డెక్కర్ బస్సులకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు హెచ్ఎండీఏ ఈ బస్సులను కొనుగోలు చేయడం మంచిదే అయినా. ప్రజా రవాణా రంగంతో ఎలాంటి సంబంధం లేని హెచ్ఎండీఏ సంస్థే ఈ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.దీంతో ఏడాది కాలంగా ఈ బస్సుల నిర్వహణ గమ్యం లేని ప్రయాణంలా మారింది. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణాన్ని అందజేస్తూ ఈ బస్సులు ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్నింటిని సాలార్జంగ్ మ్యూజియం, వేవ్‌రాక్స్ వరకు నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు. కానీ అందులో స్పష్టత లేదు. ప్రయాణికులు లేక వెలవెలాపోతూ ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రం ట్యాంక్‌బండ్ చుట్టూ మాత్రం కనిపిస్తున్నాయి. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు వీటిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. కా నీ ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు తక్కువే.ఆర్టీసీకి అప్పగిస్తేనే మేలు... నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ 2003 వరకు నడిపింది. ప్రయాణికులను, పర్యాటకులను అప్పట్లో ఇవి విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరిగి అదేవిధంగా ప్రయాణికుల ఆదరణతో పాటు ఆదాయం కూడా లభించాలంటే ఈ బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తే బాగుంటుందని రవాణారంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డిపోల్లో విద్యుత్ చార్జింగ్ సదుపాయం ఉంది. పైగా అన్ని రూట్లపైన సమగ్రమైన అధ్యయనం చేసి శాస్త్రీయమైన పద్ధతిలో ఈ బస్సులను నడిపే సమర్ధత కేవలం ఆరీ్టసీకే ఉంటుంది.ఈ బస్సులకు ఒక సారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. కేవలం రెండున్నర గంటల్లో చార్జింగ్ పూర్తవుతుంది.ఏడాదిలో రూ.60.43 లక్షలు..ఈ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలని గతంలో ప్రతిపాదించారు. కానీ అందుకు భిన్నంగా హెచ్ఎండీఏ వీటి నిర్వహణ బాధ్యతలను అహ్మదాబాద్‌కు చెందిన ఎస్ఆర్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు అప్పగించింది. ఈ బస్సుల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ఆపరేషన్స్, మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కోసం ఏటా హెచ్ఎండీఏ ప్రతి నెలా రూ..5,03,585 చొప్పున ఖర్చు చేస్తోంది. ఏటా రూ.60.43 లక్షల వరకు వెచ్చిస్తోంది. ఈ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 66 మందికి సీటింగ్ సదుపాయం ఉంది. కానీ టూరిస్ట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నడుపుతున్న ఈ బస్సుల్లో పట్టుమని పది మంది కూడా ప్రయాణం చేయకపోవడం గమనార్హం. హెచ్ఎండీఏ అధికారుల నుంచి లభించిన వివరాల మేరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్, పీవీఎన్ఆర్ మార్గ్, ఖైరతాబాద్, నాంపల్లి రూట్లో 20 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇక సెక్రటేరియట్ నుంచి సాలార్‌జంగ్‌మ్యూజియం వరకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సెక్రటేరియట్–వేవ్‌రాక్స్ వరకు తిరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. కానీ ఈ రెండు రూట్లలో ఈ బస్సులు కనిపించకపోవడం గమనార్హం. -
కార్ఖానాల అడ్డా
సిటీవాసులకు జాయ్‌ఫుల్ జర్నీని రుచి చూపించిన డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది ఇక్కడ్నుంచే.. ! ఇండియన్ ఆర్మీ కోసం శక్తిమాన్ ట్రక్స్ వెళ్లిందీ ఇక్కడి నుంచే..!1952లో స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్ రూపుదిద్దుకున్నదీ ఇక్కడే..! ఇవన్నీ శతాబ్దాల చరిత్ర మూటగట్టుకున్న భాగ్యనగరం నుంచి వెళ్లినవే. కళ్లు చెదిరే కట్టడాలకే కాదు.. శాస్త్ర సాంకేతికతలోనూ ఆ రోజుల్లోనే నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నిజాం ప్రభువుకు చెందిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఆవిష్కృతమైన అద్భుతాలకు సనత్ నగర్ ప్రాంతం కేంద్రంగా నిలిచింది. 1942లో ఇప్పటి ఓల్టాస్ ఉన్న ప్రాంతంలో నిజాం సైనికుల కోసం ప్రత్యేకంగా గన్స్ తయారు చేయించేవారు. ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకున్న టాటా-బిర్లా యాజమాన్యం ఆల్విన్ కంపెనీకి పురుడు పోసింది. 1948లో హైదరాబాద్ విలీనం తర్వాత సనత్‌నగర్ ప్రాంతంలోని అల్లావుద్దీన్ అండ్ కంపెనీకి చెందిన 408 ఎకరాల భూమిని రాష్ట్రపతి స్వాధీనం చేసుకున్నారు. అందులోని 150 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను కేంద్ర కార్మిక సంస్థ ఆహ్వానించింది. ఆ ప్రాంతానికే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా పేరు పెట్టారు. మొట్టమొదటి కార్మికశాఖ మంత్రి జగ్జీవన్‌రామ్ చేతుల మీదుగా ఈ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. ఆల్ ఇన్ ఆల్విన్ ఇండస్ట్రియల్ ఏరియాగా మారిన తర్వాత ఆల్విన్ తన ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచింది. శక్తిమాన్ ట్రక్స్, బస్సుల బాడీలు ఇక్కడే రూపొందించేవారు. ఏపీఎస్ఆర్టీసీ అనుబంధంగా 1963లో డబుల్ డెక్కర్ బస్సు డిజైన్ చేసి తయారు చేసింది కూడా ఇక్కడే. 1969లో ఈ కంపెనీని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1970-80 మధ్యకాలంలో ఆల్విన్ కంపెనీ రిఫ్రిజిరేటర్లు వరల్డ్ వైడ్‌గా పేరు సంపాదించాయి. 1990 తర్వాత నష్టాల బాట పట్టింది. దీన్ని అప్పటి ప్రభుత్వం వోల్టాస్ లిమిటెడ్‌కు అప్పగించింది. 1994లో ఇది పూర్తిగా ప్రైవేట్‌పరం అయింది. 2002 వరకు ఆల్విన్ మోడల్స్‌తోనే రిఫ్రిజిరేటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఆల్విన్‌కు సంబంధించిన ఉత్పత్తులన్నీ నిలిచిపోయాయి. మరెన్నో కంపెనీలు.. బెక్లెట్ హైలాం (హైలాం షీట్ల ఉత్పత్తి), ఫర్నిచర్ ఇండస్ట్రీ, దక్కన్ మెటల్ వర్క్స్, ఈసీఐఎల్, బీడీఎల్, చైన్ ఫ్యాక్టరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బడా కంపెనీలు సనత్‌నగర్‌లో అడుగుపెట్టాయి. తర్వాత దక్కన్ మెటల్ వర్క్స్ ఆగ్రోమెక్ స్టీల్ పరిశ్రమగా మారింది. బీడీఎల్ చాంద్రాయణగుట్టకు, ఈసీఐఎల్ ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలిపోయాయి. ఫార్మా కంపెనీలు హెటెరో డ్రగ్స్, నాట్కో రీసెర్చ్ సెంటర్, బ్రైట్ స్టార్ రబ్బర్, దివీస్, సిప్రా, గ్లాండ్ఫార్మా, ల్యాంకో వంటి బడా కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. వీటితో పాటు 200 వరకు బడా ఛోటా కంపెనీలు ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. జెకొస్లేవేకియన్ల అడ్డా.. నిజాం పాలన సమయంలో జెకొస్లేవేకియా దేశస్తులు విహారయాత్ర పేరిట నగరానికి వచ్చేవారు. వారి కోసం నిజాం పాలకులు ఆల్విన్ కంపెనీ ఎదురుగా ప్రత్యేకంగా 18 బంగ్లాలను నిర్మించి కేటాయించారు. వాటి స్థానంలో ఇప్పుడు అపార్ట్మెంట్లు వెలిశాయి. ఒకప్పుడు జెకొస్లేవేకియన్లకు పర్యాటక విడిదిగా ఉన్న ప్రాంతం కావడంతో ఆ ఏరియా జెక్ కాలనీగా నిలిచిపోయింది. సెకండ్ హ్యాండ్ మార్కెట్ సనత్‌నగర్ ప్రాంతంలో ప్రతి ఆదివారం సాగే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే ఫుల్ డిమాండ్ ఉండేది. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ మార్కెట్లో గుండుసూది నుంచి గునపాల వరకు అన్నీ పనిముట్లు లభించేవి. అప్పట్లో పదెకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ కొనసాగేది. ఇప్పుడు ఎర్రగడ్డ చౌరస్తా నుంచి సనత్‌నగర్ రోడ్డు వరకూ కొనసాగుతోంది. -
డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్
కాజీపేటరూరల్/డోర్నకల్/కేసముద్రం/నెక్కొండ/మహబూబాబాద్ : ఇప్పటివరకు మనమంతా డబుల్ డెక్కర్ బ స్సు, డబుల్ డెక్కర్ విమానం గురించి విన్నాం. కానీ.. ప్రస్తుతం మన ముందుకు డబుల్ డెక్కర్ రైలు కూడా వచ్చిం ది. వివరాల్లోకి వెళితే.. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2012 రైల్వేబడ్జెట్‌లో సికింద్రాబాద్ డివిజ న్కు ప్రభుత్వం రెండు డబుల్ డెక్కర్ రైళ్లు మంజూరు చేసింది. ఇందులో కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు వరకు వయా నడికుడి మీదుగా నడిపించేందుకు అధి కారు లు నిర్ణయించారు. వీటిలో ప్రస్తుతం కాచిగూడ నుంచి తిరుపతి వరకు మాత్రమే ఒక డబుల్ డెక్కర్‌ను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ రైలు సోమవారం కాజీపేట, డోర్నకల్ జంక్షన్ పరిధిలోని రైలు పట్టాలపై పరుగులు తీయడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. గుంటూరు నుంచి కాచిగూడ మీదుగా తిరుపతికి నడిపిస్తున్న డబుల్‌డెక్కర్ రైలు జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఆగి ఉండడంతో దానిని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా, రైలులోని బోగీలు వెడల్పుగా ఉండడంతోపాటు సాధారణ బోగీల కంటే ఎత్తు కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే రైలులో మొత్తం 17 బోగీలు ఉండగా, ఒక్కో బోగీలో రెండు అంతస్తులు కలిపి 120 సీట్లు ఉన్నాయి. కాగా, ఈ డబుల్‌డెక్కర్ రైలును త్వరలో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు, కాజీపేట నుంచి విజయవాడకు నడిపించే అవకాశం ఉండడంతో ముందస్తుగా అధికారులు ట్రయల్న్ర్ నిర్వహించి నట్టు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా, రైలును కాజీపే ట, డోర్నకల్ జంక్షన్లలో ప్రతి స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల మీదుగా నడిపించి పరీక్షించారు. బోగీలకు కెమెరాలను అమర్చి ప్లాట్ఫారం, బోగీల మధ్య ఉన్న ప్రదేశాన్ని పరి శీలించారు. -
డబుల్ డెక్కర్ రైలు రెడీ
* 14 నుంచి రాయలసీమ వాసులకు సేవలు * వెంకటాద్రి మార్గంలోనే పరుగులు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు బెంగళూరు, చెన్నై, ముంబైలాంటి నగరాల్లో మాత్రమే మనం డబుల్‌డెక్కర్ బస్సులను చూశాం. ఆ బస్సులను తలపించేలా ఇప్పుడు డబుల్‌డెక్కర్ రైలే మన ప్రాంతానికి వచ్చేస్తోంది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలతో కూడిన డబుల్ డె క్కర్ రైలు మంగళవారం నుంచి పట్టాలపై కూత పెట్టనుంది. ఇది వారంలో రెండు రోజులు గుంటూరు-కాచిగూడ మధ్య, నాలుగు రోజులు తిరుపతి-కాచిగూడ మధ్య నడవనుంది. ఈ రైలు రాకతో రాయలసీమ వాసులకు పగటిపూటే పూర్తి ఏసీతో కూడిన ప్రయాణం చేసే అదృష్టం దక్కనుంది. ఈ డబుల్‌డెక్కర్ వెంకటాద్రి నడిచే మార్గంలోనే నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దాంతో వెంకటాద్రి రైలుకు ప్రయాణికుల రద్దీ గురు, ఆదివారాల్లో బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు కాచిగూడ నుంచి అధికారికంగా 14వ తేదీ ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరుపతికి రానుంది. ఇక్కడి నుంచి 15వ తేదీ ఉదయం తిరిగి కాచిగూడకు బయలుదేరుతుంది. ఇందులో తిరుపతి నుంచి కాచిగూడకు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.395గా చార్జీలు ప్రకటించారు. తత్కాల్లో 60 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటికి అదనంగా రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ఈరైలు నడిచే మార్గం.. చేరుకునే స్టేషన్.. సమయం 15వ తేదీ ఉదయం 05:45 గంటలకు (ట్రైన్‌నెం:22119) తిరుపతి నుంచి బయలుదేరే డబుల్‌డెక్కర్ రైలు 6:00 గంటలకు రేణిగుంట, 07:13కు రాజంపేట, 08:05కు కడప, 08:43కు ఎర్రగుంట్ల, 09:46కు తాడిపత్రి, 11:00కు గుత్తి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12:10కి డోన్(ద్రోణాచలం), ఒంటి గంటకు కర్నూలు, 02:05కు గద్వాల్, 03:05కు మహబూబ్‌నగర్, సాయంత్రం 05:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుం ది. ఆ రోజు నుంచి ప్రతి గురు, ఆది వారాల్లో తిరుపతిలో బయల్దేరుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాగా కాకుండా ఈ డబుల్‌డెక్కర్ పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అలాగే కాచిగూ డ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 06:45 గంటలకు (ట్రైన్ నెం:22120) బయలుదేరి 08:06కు మహబూబ్‌నగర్, 09:26కు గద్వా ల్, 11:00కు కర్నూల్, మధ్యాహ్నం 12:10కి డోన్, ఒంటి గంటకు గుత్తి, 01:47కు తాడిపత్రి, 02:49కి ఎర్రగుంట్ల, 03:20కి కడప, సాయంత్రం 04:20కి రాజంపేట, 05:35కి రేణిగుంట, 06:18కి తిరుపతికి చేరుకుంటుంది. డబుల్‌డెక్కర్ రైలు ప్రత్యేకతలు * డబుల్‌డెక్కర్ రైలు గంటకు 160 కిమీ వేగంతో నడుస్తుంది. * డబుల్‌డెక్కర్‌లో ఒక్కో బోగీకి 120 సీట్లు ఉంటాయి. (లోయర్ డెక్‌లో-48, మిడిల్ డెక్‌లో-22, అప్పర్ డెక్‌లో-50 సీట్లు ఉంటాయి). * బోగీల్లో ఏదైనా పొగ, ఇతరత్రా అగ్ని సంబంధిత పరిస్థితులు ఎదురైతే బిగ్గరగా మోగే అలారం, ఆటోమేటెడ్ ఓపెన్ డోర్లు ఉంటాయి. * డబుల్‌డెక్కర్ రైలు బోగీల పొడవు 24 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు, ఎత్తు 4.3 మీటర్లు. * బోగీల్లో సీట్లు ఎదురెదురుగా ఉండి మధ్యలో భోజనం చేయడానికి వీలుగా చెక్క పలకలు ఏర్పాటు చేశారు. * 14 బోగీలూ పూర్తి ఏసీ ఉంటాయి. -
లారీ - స్కూల్ బస్సు ఢీ:15 మంది మృతి
పశ్చిమ థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో వెళ్తున్నడబుల్ డక్కర్ బస్సు ఎదురుగా వస్తున్న భారీ లారీని శుక్రవారం తెల్లవారుజామున ఢీ కొట్టింది. ఆ ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందారు. మృతులలో 13 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మంది అక్కడికక్కడే మరణించారని చెప్పారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆ ప్రమాదంలో మరో 30 మందికిపైగా గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడం లేదా డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


