తనిఖీలతో బోధనెలా? | New responsibilities for 2,000 teachers in Telangana | Sakshi
Sakshi News home page

తనిఖీలతో బోధనెలా?

Jun 23 2025 5:58 AM | Updated on Jun 23 2025 5:58 AM

New responsibilities for 2,000 teachers in Telangana

పాఠశాలల పర్యవేక్షణకు సీనియర్‌ టీచర్లు

2,000 టీచర్లకు కొత్త బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలకు టీచర్లనే నియమిస్తూ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు దుమారం రేపుతున్నాయి. టీచర్ల సంఘాలు దీన్ని అనాలోచిత నిర్ణయమని విమర్శిస్తున్నాయి. ఈ నిర్ణయం పాఠశాలల్లో టీచర్ల కొరతను మరింత పెంచుతుందని, పైరవీలకు ద్వారాలు తెరిచినట్టే అవుతుందని పలువురు టీచర్లు అంటున్నారు. ఈ విధానంపై పాఠశాల విద్య ఉన్నతాధికారులు కూడా పెదవి విరుస్తున్నారు. 
 
ఇప్పటివరకు ఉన్నతాధికారులకే.. 
రాష్ట్రంలో 24 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పర్యవేక్షణకు ప్రతి మండలంలో మండల విద్యాధికారులు ఉంటారు. సాధారణంగా ప్రధానోపాధ్యాయుడికే పదోన్నతి కల్పించి ఎంఈఓగా నియమిస్తారు. గత ఏడాది వరకు ఒక్కో హెచ్‌ఎంకు ఐదు మండలాల వరకు పర్యవేక్షణ బాధ్యత ఉండేది. గత సంవత్సరం పదోన్నతుల కారణంగా ఒక్కో మండలానికి ఒక్కో ఎంఈఓ వచ్చారు. 

వీరితో పాటు మండల రిసోర్స్‌ పర్సన్స్‌ కూడా ఉంటారు. వీళ్లంతా పాఠశాలలను తనిఖీ చేసి, జిల్లా విద్యాధికారికి ప్రతి నెల నివేదిక ఇస్తారు. డీఈఓ ద్వారా ఇది రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు చేరుతుంది. స్కూళ్లల్లో విద్యార్థుల హాజరు పట్టిక నిర్వహణ, సిలబస్‌ సకాలంలో పూర్తవుతుందా లేదా? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలపై నివేదికలు ఇస్తారు. కానీ, ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయులకే ఈ బాధ్యతను అప్పగించడం వివాదానికి కారణమైంది.  

సమస్య ఏమిటి? 
రాష్ట్రంలో 1.06 లక్షల మంది ప్రభుత్వ టీచర్లున్నారు. కొన్ని స్కూళ్లల్లో టీచర్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువ ఉన్నారు. ఈ లెక్కన దాదాపు 6 వేల మంది టీచర్లు మిగులు ఉన్నారనేది ప్రభుత్వం వాదన. కానీ విద్యార్థులు తక్కువ ఉన్నా అన్ని సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుందని, ఈ లెక్కన ఇంకా టీచర్ల అవసరం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. 

ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పదేళ్ల బోధన అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం లేదా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ రోజూ రెండు స్కూళ్లను తనిఖీ చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పదేళ్ల సరీ్వస్‌ ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు కూడా రోజూ రెండు స్కూళ్లు తనిఖీ చేయాలి. 

ఉన్నత పాఠశాలల్లో కూడా స్కూల్‌ అసిస్టెంట్లనే తీసుకుంటారు. వీళ్లు మూడు నెలల్లో50 స్కూళ్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. స్కూల్‌ హెచ్‌ఎం కేడర్‌ కంటే ఎస్‌ఏ, ఎస్జీటీ కేడర్‌ తక్కువ. ఇలాంటి వారిచేత స్కూళ్లను తనిఖీ చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది టీచర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తే బోధనకు టీచర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.  

పైరవీలకు దారులు 
తనిఖీల కోసం టీచర్ల ఎంపిక ఎలా చేస్తారనే దానిపై విద్యాశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నియామకానికి ఏదైనా రాత పరీక్ష నిర్వహిస్తారా? కిందిస్థాయి అధికారుల సిఫార్సుల మేరకే ఎంపిక చేస్తారా? అనేది తెలియడం లేదని సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే డిప్యుటేషన్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. 

పర్యవేక్షణ కోసం నియమించేవారు రోజూ స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పేరుతో ఇతర సొంత పనులు చేసుకునే వీలుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగే అవకాశం ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

ఇదెక్కడి న్యాయం 
హైస్కూళ్లలో గెజిటెడ్‌ హెచ్‌ఎంలు పని చేస్తారు. వీరికన్నా తక్కువ స్థాయి ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లను పర్యవేక్షణకు నియమించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇదెక్కడి న్యాయమో అధికారులే చెప్పాలి. పైగా బోధన కుంటుపడే వీలుంది. తక్షణమే ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలి.  
– ఆర్‌ రాజగంగారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్‌ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు. 

ప్రమాణాలు తగ్గుతాయి 
పదేళ్ల అనుభవం ఉన్నవారిని ఏడాది పొడవునా తనిఖీలకే వినియోగిస్తే ప్రభుత్వ స్కూళ్లల్లో బోధకుల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరికాదు. 
– యం సోమయ్య, టి లింగారెడ్డి, డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement