కాకినాడ జేఎన్‌టీయూ వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌పై అవినీతి, ఫోర్జరీ లాంటి తీవ్ర అభియోగాలు
420 సహా పలు సెక్షన్ల కింద హనుమకొండ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సమన్లు
ఖాజీపేట పోలీసు స్టేషన్‌లో కేసుల నమోదు
వరంగల్ ‘నిట్’ పూర్వ విద్యార్థుల సంఘం నిధుల దుర్వినియోగం
‘నిట్వా’ ఎన్నికల్లో దొంగ ఓట్లను చేర్చడంలో కీలకపాత్ర
అలాంటి వ్యక్తిని వీసీగా నియమించిన చంద్రబాబు
అస్మదీయుల కోసం వర్సిటీలను భ్రష్టు పట్టిస్తున్న బాబు సర్కారు
రెడ్‌బుక్ రాజ్యాంగంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు సర్వ నాశనం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యా వ్యవస్థను సైతం భ్రష్టు పట్టిస్తోంది. అస్మదీయులకు అడ్డగోలుగా వైస్ చాన్సలర్ పదవులు కట్టబెట్టి యూనివర్సిటీలను సర్వ నాశనం చేస్తోంది. 420గా ముద్రపడిన మోసగాళ్లు, అత్యంత వివాదాస్పదులను వీసీ పోస్టులో కూర్చోబెట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. విద్యా వేత్తలకు ఇవ్వాల్సిన ఉన్నత పదవిని ఓ నేర చరితుడికి ఇవ్వడం విస్తుగొలుపుతోంది. కాకినాడ జేఎన్‌టీయూ వీసీ నియామకమే దీనికి నిదర్శనం. డాక్టర్ అల్లం అప్పారావు లాంటి ప్రముఖ విద్యావేత్తలు సారథ్యం వహించిన కాకినాడ జేఎన్‌టీయూ వీసీగా సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను గతేడాది ఫిబ్రవరిలో కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయనపై అవినీతి, ఫోర్జరీ లాంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ వీసీగా ఎంపిక చేయడం చంద్రబాబు సర్కారు బరితెగింపునకు తార్కాణం.
ఫోర్జరీ పత్రాల నిందితుడికి వీసీ పోస్టు!
కాకినాడ జేఎన్‌టీయూ వీసీగా నియమించిన సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌పై తెలంగాణలోని పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల్లో పలు సెక్షన్ల కింద కుప్పలు తెప్పలుగా కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాలతో కోర్టును ఉద్దేశపూర్వకంగా మోసం చేశారనే అభియోగంతో ఇటీవలే హనుమకొండ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏకంగా 415, 416, 418, 420, 464, 468, 469, 471 సెక్షన్ల కింద సమన్లు ఇవ్వడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సెక్షన్లను పరిశీలిస్తే.. దారుణమైన మోసం, వేరొకరిలా నటించి మోసం చేయడం, ఎదుటి వ్యక్తికి నష్టం కలుగుతుందని తెలిసీ మోసానికి పాల్పడటం, నకిలీ సంతకాలతో మోసగించడం, తప్పుడు పత్రాలు సృష్టించడం, ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఫోర్జరీ పత్రాలు తయారీ, నకిలీ పత్రాలను నిజమైనవిగా నమ్మించి వినియోగించడం వంటి నేరాల్లో నిందితులుగా లెక్క. వీటిల్లో అధిక సెక్షన్లలో నేరం రుజువైతే ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఎంపికలో దారుణ వైఫల్యం..
విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. విద్యావంతులు, భవిష్యత్తు సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే మేధావులకు పెద్దపీట వేయాలి. కానీ టీడీపీ పెద్దలు తమ అస్మదీయుడనే ఒకే ఒక అర్హతతో కొందరికి వీసీ పోస్టులు కట్టబెట్టేశారు. ఇందులో భాగంగానే అవినీతి, ఫోర్జరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను కాకినాడ జేఎన్‌టీయూ వీసీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. దీంతో వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీల పాత్ర మరోసారి ప్రశ్నార్థకమైంది. సెర్చ్ కమిటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన పేర్లతో సెర్చ్ కమిటీ జాబితా సిద్ధం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపుతోంది. ఇక వీసీల నియామకాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక తూతూమంత్రంగా మారింది.
ఇవీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ నిర్వాకాలు..!
వరంగల్ నిట్ ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్‌ఐటీ వరంగల్ ఆలూమ్ని అసోసియేషన్ (నిట్వా) అందించిన నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆ తప్పును కప్పిపుచ్చేందుకు యత్నించారు. ప్రతిభావంతులకు మేలు చేసేందుకు నిట్‌లోని ఓ భవనాన్ని లీజుకు తీసుకుని ప్రస్తుత, పూర్వ విద్యార్థులను అనుసంధానించేందుకు నిట్వా రూ.1.30 కోట్లు సమీకరించింది. అయితే భవనం ఆధునికీకరణలో రూ.40 లక్షలు దారి మళ్లాయని, సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌కు అత్యంత సన్నిహితులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఒత్తిడితో అప్పటి ఐఆర్‌ఏఏ డీన్ 2022లో నిట్వా ఎన్నికల్లో తమ అనుకూల వర్గాన్ని గెలిపించేందుకు అక్రమంగా ఓట్లు జొప్పించారు. ఈ కేసు ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో ఉంది.
కోర్టు కళ్లు గప్పేందుకు యత్నించి..!
ఎన్నికల్లో అక్రమాలపై నిట్వా మాజీ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అప్పటి డైరెక్టర్‌పై ఒత్తిడి చేసి ఇందులో చేర్చారు. అనంతరం ఆ డైరెక్టర్ బదిలీపై వెళ్లిపోగా సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ న్యాయస్థానాన్ని మోసం చేసే కుట్రకు తెర తీశారు. గత డైరెక్టర్ సంతకాలు, పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) లేకుండానే ఆయన అథారిటీ ఇచ్చినట్లుగా కేసును నడిపించారు. పాత న్యాయవాది నుంచి నో అబ్జెక్షన్ లేకుండానే మరో న్యాయవాదితో వకాలత్ వేయించి మరో తప్పు చేశారు. ఈ విషయం బయటపడటంతో తాను ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వలేదని అప్పటి డైరెక్టర్ రాత పూర్వకంగా కోర్టుకు నివేదించారు. సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఫోర్జరీ, అవినీతి బాగోతంపై ‘నిట్వా’ మాజీ అధ్యక్షుడు ఎన్‌ఐటీ డైరెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
ఇక 2025 ఫిబ్రవరిలో ఖాజీపేట పోలీసు స్టేషన్‌లో సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌పై ఫిర్యాదు చేయగా సివిల్ కేసుగా పరిగణించారు. దీంతో గత ఆగస్టులో కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం స్వీకరించి నిందితుడు సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌కు 8 రకాల ఐపీసీ సెక్షన్లు కింద సమన్లు జారీ చేసింది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కరెస్పాండెంట్ అనుమతి లేకుండా సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ దొంగ సంతకాలతో నడిపించడం గమనార్హం. ఎన్‌ఐటీ పూర్వ విద్యార్థి, నిట్వాలో సభ్యుడు అయినప్పటికీ అసోసియేషన్‌కు నష్టం చేకూర్చేలా వ్యవహరించారు. ఆయన జేఎన్‌టీయూ కాకినాడ వీసీగా వచ్చినప్పటి నుంచి పాలనా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టి అనర్హులకు పెద్దపీట వేయడం, అవినీతిని ప్రోత్సహిస్తుండడంపై వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


