దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ (Fraternity) లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది. ఇందుకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సారథ్యం వహించింది.
‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.
కొఠారి కమిషన్ నివేదిక ప్రస్తావన
సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణం(Rich Culture)లో ఇమడగలరా? అనే సందేహాలను పక్కన పెట్టాలని, ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారి గౌరవాన్ని పెంచాలని సూచించింది.
రాష్ట్రాలకు, ఎన్‌సీపీసీఆర్‌కు ఆదేశాలు
విద్యా హక్కు చట్టం (RTE)లోని సెక్షన్ 12(1)(సీ) కింద ఉన్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 38 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను (Subordinate Legislation) సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
‘సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు. కానీ, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుంది’ - సుప్రీంకోర్టు
సంప్రదింపులు
ఈ నిబంధనల రూపకల్పన ప్రక్రియ కేవలం ఏకపక్షంగా సాగకూడదని, సంబంధిత విభాగాల భాగస్వామ్యం ఉండాలని కోర్టు సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు (SCPCR), జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.
రిపోర్టింగ్, పర్యవేక్షణ
ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ గడువును విధించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన లేదా రూపొందించిన నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్‌సీపీసీఆర్‌ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31 లోగా ఒక సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం


