breaking news
free seats
-
రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూళ్లో చదవాలి: సుప్రీంకోర్టు
దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ (Fraternity) లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది. ఇందుకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం సారథ్యం వహించింది.‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.కొఠారి కమిషన్ నివేదిక ప్రస్తావనసమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణం(Rich Culture)లో ఇమడగలరా? అనే సందేహాలను పక్కన పెట్టాలని, ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారి గౌరవాన్ని పెంచాలని సూచించింది.రాష్ట్రాలకు, ఎన్సీపీసీఆర్కు ఆదేశాలువిద్యా హక్కు చట్టం (RTE)లోని సెక్షన్ 12(1)(సీ) కింద ఉన్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 38 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను (Subordinate Legislation) సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.‘సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు. కానీ, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుంది’ - సుప్రీంకోర్టుసంప్రదింపులుఈ నిబంధనల రూపకల్పన ప్రక్రియ కేవలం ఏకపక్షంగా సాగకూడదని, సంబంధిత విభాగాల భాగస్వామ్యం ఉండాలని కోర్టు సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు (SCPCR), జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.రిపోర్టింగ్, పర్యవేక్షణఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ గడువును విధించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన లేదా రూపొందించిన నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్‌సీపీసీఆర్‌ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31 లోగా ఒక సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం -
తెగబడ్డ తెలుగు తమ్ముళ్లు
- ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని అల్టిమేటం - మట్కా బీటర్లనూ వదలని టీడీపీ చోటా నేతలు - పులివెందులలో అధికారులపై రాజకీయ పెత్తనం - చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ కీలక నేతలు కడప: పులివెందులలో అప్పుడే అధికార పార్టీ నేతల ఆగడాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో పాటు మట్కా బీటర్లను, జూద నిర్వాహకులను మామూళ్లకోసం బెదిరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆది నుంచి పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికే పట్టం కడుతూ వస్తున్నారు. వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక కొంతమంది టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. 2009లో వైఎస్ మరణానంతరం పులివెందులపై అప్పటి ప్రభుత్వం శీతకన్ను వేసి నిధులు విడుదల చేయలేదు. ఆ తర్వాత ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేసే చర్యలకు ఉపక్రమించారు. పులివెందుల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలతోపాటు మున్సిపల్, స్థానిక ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్‌పార్టీ భారీ ఆధిక్యత ముందు కనీసం టీడీపీ పరువు కూడా దక్కించుకోలేకపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిలకు పులివెందుల ప్రజలు 80వేల పైచిలుకు మెజార్టీ అందించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పలువురు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. మట్కా బీటర్లనూ వదలని టీడీపీ చోటా నేతలు : ‘నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా పలువురు తెలుగుత మ్ముళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆదాయమే పరమావధిగా తెగబడుతున్నారు. నీకు మట్కా.. నాకు గ్యాంబ్లింగ్ అంటూ పలువురు చోటా నేతలు పంపకాలకు తెర తీస్తున్నారు. పులివెందులలో మట్కా, జూదం, మొబైల్ గ్యాంబ్లింగ్‌లు నిర్వహిస్తున్న వారిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏకంగా అధికారం వచ్చిన వారం రోజుల్లోపే పట్టణంలో మట్కా రాస్తున్న వారి వద్దకు వెళ్లి నెలనెలా మామూళ్లు ఇవ్వాలని బెదిరించిన పర్వం వెలుగులోకి వచ్చింది. పైగా మట్కా రాస్తుండగా వచ్చిన సొమ్మునంతా కూడా బీటరు నుంచి కొంతమంది చోటా,మోటాలు లాక్కెళ్లినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. దీంతో బెంబేలెత్తిన కొంతమంది కంపెనీ మట్కా బీటర్లు ఏకంగా కొద్దిరోజులపాటు పులివెందుల విడిచి వెళ్లారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. పోలీసులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. కొంతమంది పోలీసులు ఏకంగా మామూళ్లు తీసుకొని మట్కా ఆడిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుతోపాటు పోలీసులు పట్టించుకోని వైనంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని టీడీపీలో కొంతమంది కీలక నేతలు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో సీఎంను కలిసి పులివెందులలో జరుగుతున్న మొత్తం పరిస్థితులను చంద్రబాబుకు వివరించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా టీడీపీలోని కొంతమంది నేతలు మట్కా వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని అల్టిమేటం : పులివెందులలోని ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాలకు కూడా ఉచిత సీట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరుతో అల్టిమేటం ఇచ్చారు. దాదాపు 60నుంచి 70సీట్లు కావాలని కోరినట్లు తెలిసింది. టీడీపీ ఆఫీసు నుంచి పంపించే లిస్ట్‌లోని విద్యార్థులను చేర్చుకోవాలని కోరగా.. ప్రయివేట్ యాజమాన్యాలు అన్ని సీట్లు ఇవ్వలేమని చేతులెత్తేసినట్లు తెలియవచ్చింది. అధికారులపై రాజకీయ పెత్తనం : అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పోస్టు మాకే కావాలని కొందరు.. ఉన్న పోస్టులను రద్దు చేయండని మరికొందరు చేస్తున్న రాజకీయ ఒత్తిడులతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. పులివెందుల ప్రాంతంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలతోపాటు మున్సిపల్, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఇలా ఎప్పుడు ఒత్తిళ్లకు గురి చేయలేదని.. ప్రతి దానికి టీడీపీ చోటా నేతలు వచ్చి కార్యాలయాల్లో బెదిరించడం తగదని పలువురు అధికారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మూకుమ్మడిగా సెలవులో వెళ్లడానికి కూడా సిద్ధమని పలువురు అధికారులు పేర్కొన్నారు.


