వెండితెరపై కనిపించాలనేదే నా ఆశయం... | Sakshi
Sakshi News home page

వెండితెరపై కనిపించాలనేదే నా ఆశయం...

Published Mon, Jan 1 2024 11:50 AM

New Life start in new year - Sakshi

సాక్షి, పెద్దపల్లి: కొత్త సంవత్సరం–2024లో గతాన్ని త్యజించి కొంగొత్త ఆశలతో లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రయత్నిస్తాం. నూతన సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నిరంతర సాధన, కఠోర శ్రమతో సాధిస్తామని జిల్లాలోని పలువురు ప్రముఖులు, యువతులు అంటున్నారు. వారి మనోగతం వారి మాటల్లోనే..

ఉద్యోగ సాధనే లక్ష్యం 
కొత్త సంవత్సరంలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. అందుకు అనుగుణంగా శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న. ఇప్పటికే కొన్ని పరీక్షలకు హాజరయ్యా. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తానని నమ్మకం ఉంది.
– పుల్లూరి అరవింద్, అందుగులపల్లి

వెండితెరపై కనిపించాలి
23 సంవత్సరంలోకి అడుగు పెట్టి ముందు తీసుకున్న నిర్ణయాలు దాదాపు అమలు చేశా. అందరూ మెచ్చుకునేలా నా అభినయంతో జనాల అభిమానం పొందాలనుకున్న. అనుకున్న దానికంటే అభిమానులకు ఎక్కువగా దగ్గరయ్యాను. 2024లో కచ్చితంగా వెండితెరపై కనిపించాలనేదే నా ఆశయం.
– వర్శిణి, యూట్యూబ్‌ స్టార్, గోదావరిఖని

అక్షరజ్ఞానం పెంచాలి 
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులకు ఫలాలు అందేలా చూడటం నా మెయిన్‌ జాబ్‌. ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్స్‌ ప్రమోట్‌ చేయాలనుకుంటున్న. యువతకు జాబ్స్‌ అండ్‌ కెరీర్‌పై అవగాహన కల్పించడం చాలా ఇంట్రెస్ట్‌. నేను టీచింగ్‌ ప్రొఫెషన్‌ నుంచి వచ్చా. మురికివాడల్లో ఉండే మహిళలు నిరక్షరాస్యులు. వారు కనీసం చదవడం, సంతకం చేయడం నేర్చుకునేలా చర్యలు తీసుకుంటా.
– రజని, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

జాబ్‌ కొట్టడం లక్ష్యం
గతేడాది ప్రభుత్వ నోటిఫికేషన్లు రాలేదు. సంవత్సరాలు గడుస్తున్నా నోటిఫికేషన్లు రావడంలేదు. ఈఏడాదైనా నోటిఫికేషన్లు విడుదలచేస్తే కచ్చితంగా జాజ్‌ కొట్టి జీవితంలో సెటిల్‌ అవ్వాలి. ఈ ఏడాదిలోనైనా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వం నూతన సంవత్సరంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీచేస్తుందని నాతోపాటు నిరుద్యోగులు ఆశిస్తున్నారు.
– పొరండ్ల అనిల్, నిరుద్యోగి, జూలపల్లి 

ప్రకృతి వైద్యం చేరువ చేస్తాం 
గతేడాది రేకుర్తి కంటి ఆస్పత్రి సాయంతో దాదాపు 100 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాం. ఉచితంగా అనేక వైద్య విబిరాలు నిర్వహించాం. ఈఏడాది ప్రకృతి వైద్య ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాం. మందులు, ఆపరేషన్‌ అవసరం లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాం. సింగరేణి కార్మికులు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. యాజమాన్యం అవకాశం ఇస్తే ప్రకృతి వైద్యం ద్వారా వారికి సేవలు అందిస్తాం.
– శరణ్య, ప్రకృతి వైద్యనిపుణురాలు 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement