సాగర సంగమం వద్ద నీళ్లలోకి దూసుకుపోయిన కారు.. ఒకరి మృతి
సెల్ఫీ మోజులో మిద్దెపై నుంచి పడి ఓ మైనర్ దుర్మరణం
మద్యం మత్తులో బీరు సీసాలతో యువకుల దాడులు
అనంతపురం సెంట్రల్, సఖినేటిపల్లి, పుట్టపర్తి అర్బన్: నూతన సంవత్సర సంబరాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలో పలుచోట్ల అపశ్రుతులు చోటు చేసుకోవడంతో కొందరు ప్రాణాలు విడిచారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ నుంచి నిమ్మకాయల శ్రీధర్(35), నందమూరి వెంకట సాయినాథ్ గోపీకృష్ణ, బొండాడ సూర్యకిరణ్ అంతర్వేదికి బుధవారం రాత్రి చేరుకున్నారు. బీచ్‌కు సమీపంలో రూమ్ తీసుకున్నారు.
అర్ధరాత్రి దాటాక రూంలో సూర్యకిరణ్ ఉండిపోగా, శ్రీధర్, గోపీకృష్ణ కారులో బయలుదేరి బీచ్ వెంబడి డ్రైవ్ చేస్తూ సాగరసంగమం వైపుకు వెళ్లారు. లైట్‌హౌస్ సమీపానికి వెళ్లే సరికి అక్కడున్న ఒడుపును వారు గుర్తించలేకపోయారు. అదే సమయంలో కారు అదుపు తప్పడంతో సంగమం వద్ద వేగంగా నీళ్లలోకి దూసుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన గోపీకృష్ణ కారులోంచి దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. డ్రైవర్ సీటులో ఉన్న శ్రీధర్ కారుతో సహా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం శ్రీధర్ మృతదేహం లభ్యమైంది.
సెల్ఫీ తీసుకుంటూ..
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో సెల్ఫీ తీసుకుంటూ మిద్దెపై నుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాడాల తరుణ్‌కుమార్ రెడ్డి(17) మిత్రుడితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల అనంతరం మిద్దెపైకి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా తరుణ్‌కుమార్ రెడ్డి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. తరుణ్‌కుమార్ రెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
బీరు సీసాలతో దాడులు
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురంలో మద్యం మత్తులో యువకులు చెలరేగి బీరు సీసాలతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని ముత్యాలమ్మ గుడి వద్ద నివాసముంటున్న దినేష్, కళ్యాణ్.. అక్కడికి సమీపంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో వీరిపై గుర్తు తెలియని యువకులు మద్యం మత్తులో బీరు సీసాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు సంయుక్తంగా కేసును విచారిస్తున్నారు.


