
నవీన్ యాదవ్‌ను వరించిన కాంగ్రెస్ టికెట్
బీసీ కార్డుతో పాటు స్థానికుడికే అవకాశం
ఇప్పటికే అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయింది.
రెండుసార్లు పోటీ
⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి.
⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది.
మజ్లిస్ మద్దతు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటిస్తున్న కారణంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం, బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించడంతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి మంత్రంతో విజయావకాశాలను సుగమం చేసుకున్నా.. అభ్యర్థిత్వం ఖరారులో మాత్రం మజ్లిస్ పార్టీ జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లను కాదని యువనేతకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది.