రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా ఎవరికీ అన్యాయం జరగకుండా ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతీయకుండా ప్రతీ నిర్ణయాన్ని మానవీయ కోణంలోనే తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను కూడా ప్రజల కోణంలో ఆలోచించి, మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసం అంశాలపై సోమవారం సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారంతో పాటు అవసరమైన పునరావాసం కల్పించడంలో ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


