గతేడాదితో పోలిస్తే 8,531 ఎక్కువగా చేరికలు
సిలబస్ మార్పు.. ప్రమాణాల పెరుగుదల వల్లే..
మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరుగుతోందని.. ఈ ఏడాది పెరిగిన ప్రవేశాలే దీనికి నిదర్శనమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మండలి కార్యాలయంలో ఆయన కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఐ. పురుషోత్తంతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2026–27 విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో దోస్త్, నాన్–దోస్త్‌తో కలిసి 2,13,671 మంది ప్రవేశాలు పొందారని తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంతో పోలిస్తే 8,531 సీట్లు అధికంగా భర్తీ అయినట్లు చెప్పారు.
ఉపాధి అవకాశాలు పెంచేలా డిగ్రీ కోర్సుల సిలబస్‌ను తీర్చిదిద్దే దిశగా రెండేళ్లుగా కృషి చేస్తున్నామని.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చామని బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. వృత్తి విద్యా కోర్సులకు తీసిపోని విధంగా డిగ్రీ కోర్సుల్లో చేస్తున్న మార్పులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే సీట్ల పెరుగుదలకు కారణమన్నారు. కాగా, దోస్త్ పరిధిలోకి రాని ప్రైవేటు కాలేజీల్లోనూ ఈ ఏడాది సీట్లు పెరగ్గా రెసిడెన్షియల్ కాలేజీల్లో మాత్రం ఈసారి ప్రవేశాలు తగ్గాయి. విద్యార్థులు అత్యధికంగా ఫిజికల్ సైన్స్ కోర్సులో చేరితే, లైఫ్‌సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి.


