సాక్షి, హైదరాబాద్: దారి పొడవునా గుంతలు.. ఎగసిపడే దుమ్ముధూళి.. దానికి తోడు ట్రాఫిక్.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ రూట్. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో పోటాపోటీగా పోస్టర్లతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తడం.. జనాల ఫ్రస్టేషన్ తారా స్థాయికి చేరి సోషల్ మీడియాలోనూ అసహనం వెల్లగక్కడం చూశాం. అయితే అది ఎప్పటికి పూర్తవుతుందనేదానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు స్పష్టత ఇచ్చారు.
‘‘ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టాం. 5.5 కి.మీ గాను 1.5కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైంది. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం. ఉప్పల్ వరంగల్ మార్గంలో మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. రోడ్డు పనులు,ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.


2026 దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేసి తీరుతాం. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం ఆగే ప్రసక్తే లేదు’’ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. అదే ఏడాది జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నత్తనడకన సాగాయి.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అనడంతో ఆ రూట్‌లో ప్రయాణించేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ రోడ్లకు రిపేర్‌తో పాటు ఫ్లైఓవర్ పనులూ చకచకా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లో NHAI (National Highways Authority of India) ప్రధాన నిర్మాణ బాధ్యత చేపట్టగా.. GHMC అదనంగా 200 మీటర్ల పొడిగింపు పనులు చూస్తోంది.


