
కరీంనగర్: ‘తేజ్ నేనెవరితో మాట్లాడలేదు. ఆ దేవుడు, కొడుకు, మా అమ్మ.. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మన పెళ్లయినప్పటి నుంచి ఇంతవరకు నేనెవరితోనూ మాట్లాడలేదు. ఎవరితోనూ నాకు సంబంధం లేదు. నా కొడుకును బాగా చూసుకో. నీ వేధింపులతో నాకు పిచ్చిపడుతోంది. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. నా ఫోన్ చూడు నిజం తెలుస్తుంది’ అని భర్తనుద్దేశించి సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం తాడికల్‌లో చోటుచేసుకుంది.
ఆమె సెల్ఫీ వీడియో చూసిన బంధువులందరూ కన్నీరుమున్నీరయ్యారు. కేశవపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. తాడికల్‌కు చెందిన గొట్టె శ్రావ్య (27) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసమున్నారు. అప్పుడే బాబు జన్మించాడు. రెండున్నర సంవత్సరాల క్రితం ధర్మతేజ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.
అప్పటినుంచి శ్రావ్య తాడికల్‌లోనే ఉంటోంది. కొంతకాలంగా ధర్మతేజ్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి వేరే వారితో మాట్లాడుతున్నావంటూ శ్రావ్యను మానసికంగా హింసించాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ మాధవి, గ్రామీణ సీఐ వెంకట్, ఎస్సై పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సురేఖ శవపంచనామా నిర్వహించారు. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.