ప్రజాస్వామ్యం అపహాస్యం: పొన్నం
కరీంనగర్‌కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు పార్టీలు ఒకటిగా కలిసి ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేశాయన్నారు. బుధవారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూ, భౌతిక దాడులకు దిగుతూ మళ్లీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించారన్నారు. నిజామాబాద్ ఎంపీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులపై దౌర్జన్యం చేశారన్నారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న అంశాలు ఇన్నాళ్లు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నది బీజేపీయేనని, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ప్రకటనల ద్వారా ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీజేపీపై ఆయా పురపాలక పాలకవర్గాలు ఒత్తిడి తేవాలన్నారు. బీజేపీ అమలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసిన, రెండు బడ్జెట్‌లలో రూపాయి కేటాయించని బీజేపీకి ఓటు అడిగే నైతికత లేదన్నారు. తెలంగాణ ప్రజల కళ్లు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్న పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 80 శాతం మున్సిపాల్టీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని పేర్కొన్నారు.


