ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన దేశవేని గంగనర్సయ్య(54) బుధవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. గంగనర్సయ్య కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స చేయించినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఉరేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగనర్సయ్య తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.
జమ్మికుంట: బజాజ్ ఆటో ఢీకొట్టిన ఘటనలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన మారపల్లి ఐలయ్య(59) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ధర్మారం బస్టాండ్ వైపు కాలినడకన వస్తుండగా.. వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన బుర్రగళ్ల రాజ్‌కుమార్ అనే వ్యక్తి అతివేగంగా బజాజ్ ఆటో నడుపుతూ ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కాగా.. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
రేగు పండ్ల కోసం వెళ్లి..
● బావిలో పడి విద్యార్థి మృతి
వీణవంక: రేగు పండ్లు తెంపుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈర్నాల శ్రీనివాస్–శారద దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు రాజు(11) ఉన్నారు. రాజు స్థానిక పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. మంగళవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా.. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రాజు కనిపించకపోవడంతో.. రాజు కోసం వెతికారు. కొలిపాక శ్రీనివాస్ అనే వ్యక్తి బావిలో అదే రోజు అర్ధరాత్రి శవమై కనిపించాడు. విద్యుత్ మోటార్ల సాయంతో బుధవారం వెలికితీశారు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి విద్యార్థి దహన సంస్కారాలకు రూ.10వేలు అందజేశారు.
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అరవింద్‌నగర్‌లో బుధవారం మహిళ మెడలోంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రెండు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేసరికే దొంగలు పారిపోయారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య


