వీసీ వర్సెస్ ప్రొఫెసర్
శాతవాహన వీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌కు ఫిర్యాదు
దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు
మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్పినా మారని వాతావరణం
ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అంటున్నారని విద్యార్థుల ఆవేదన
జిల్లాలో అర్బన్ నక్సల్స్ ఊసే లేదన్న సీపీ ఆలం
రెండు వర్గాలుగా చీలిన వర్సిటీ సిబ్బంది
శాతవాహన గాథలు–1
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీ వివాదాలకు నిలయంగా మారుతోంది. క్రమశిక్షణ పేరిట కొంతకాలంగా వీసీ ఉమేశ్‌కుమార్ తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు నిరసన బాట పట్టగా.. తాజాగా దళితులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఏకంగా ప్రొఫెసర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దళిత మహిళనైన తనను కొంతకాలంగా తన అసంబద్ధ చర్యలతో వేధిస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అకారణంగా తనను, మరికొందరు దళిత విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేయడం తన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణలో మావోయిస్టులు లేరంటూ పలుమార్లు డీజీపీ ప్రకటిస్తుంటే.. తమను అర్బన్ నక్సలైట్లంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్న వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో వివిధ ఆరోపణలపై తొలగించిన ఇద్దరు అధ్యాపకులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఈ వి వాదానికి ఆజ్యం పోసింది. యూనివర్సిటీకి 12–బీ హోదా ఇవ్వకూడదంటూ యూజీసీకి వర్సిటీ అధ్యాపకులు కొందరు లేఖ రాశారు. విచారణ జరిపిన వర్సిటీ ఐదుగురిని బాధ్యులుగా గుర్తించి విధుల నుంచి తప్పించింది. ఆ ఐదుగురిలో ఇద్దరిని ఇటీవల వీసీ విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడే వర్సిటీ సిబ్బంది రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరి ని యామకాన్ని కొందరు విద్యార్థులు, సిబ్బంది వ్యతి రేకిస్తున్నారు. మరోవైపు వర్సిటీలో కొందరు అర్బన్ నక్సలైట్లు చేరారంటూ ఆరోపిస్తూ.. మరోవర్గం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రొఫెసర్ సుజాత పేరు ఉండటంతో ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఉమేశ్‌కుమార్ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. 12–బీ వ్యవహారంలో బహిష్కరణకు గురైన అధ్యాపకుడు పెంచాల శ్రీని వాస్‌తో కలిసి తనపై దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడుతున్నారు. కనీసం నోటిఫికేషన్ లేకుండా వారిద్దరిని తిరిగి ఎలా నియమిస్తారంటూ విద్యార్థులు ధర్నా చేయడంతో వారంపాటు వారికి క్లాసులు ఇవ్వమంటూ వీసీ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఫ్రొఫెసర్ సుజాతను వరుసగా పదవుల నుంచి తప్పించడంపై వీసీ స్పందిస్తూ.. ఆమెను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తొలగించినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.


