పల్లెల్లో పర్యావరణ విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పర్యావరణ విధ్వంసం

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

ప్రజావాణిలో ిఫిర్యాదు

స్లర్రీ నిర్వహణ అస్తవ్యస్తం.. గ్రీన్‌బెల్ట్‌కు పాతర

తారాస్థాయికి చేరిన గ్రానైట్‌ పరిశ్రమల ఆగడాలు

పట్టింపులేని పర్యావరణ నియంత్రణ మండలి

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కొత్తపల్లి:

ల్లెల్లో పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంది. గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమల ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాకేం సంబంధమన్నట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీల అనుమతుల్లేకుండా, బ్లాక్‌ దందా నిర్వహిస్తూ, డస్ట్‌ను వెదజల్లుతూ.. గ్రీన్‌ బెల్టుకు పాతరేస్తూ..శబ్ద, వాయు, జల కాలుష్యాన్ని వదులుతూ.. పచ్చని పల్లెలను పనికిరాకుండా చేస్తున్న గ్రానైట్‌ పరిశ్రమలపై అధికారులకు మమకారం చావడం లేదు. గ్రానైట్‌ కటింగ్‌ పరిశ్రమల నుంచి దుమ్ము, ధూళి వెదజల్లి ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్‌పూర్‌, నాగులమల్యాలతో పాటు గంగాధర మండలం ఒడ్యారం ప్రాంతాల్లోని గ్రానైట్‌ పరిశ్రమలు చిమ్ముతున్న కాలుష్యంపై పర్యావరణ నియంత్రణ బోర్డు పట్టింపులేనట్లు వ్యవహరిస్తోంది.

స్లర్రీ నిర్వహణ అస్తవ్యస్తం

కొత్తపల్లి మండలం బావుపేట, ఖాజీపూర్‌, శ్రీరాములపల్లి, ఎలగందుల, కమాన్‌పూర్‌, నాగులమల్యాల తదితర గ్రామాల్లో గ్రానైట్‌ స్లర్రీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రానైట్‌ కటింగ్‌ పరిశ్రమలు ఏటా లక్షల టన్నుల స్లర్రీని ఉత్పత్తి చేస్తూ నియంత్రణ లేకుండా పారవేస్తున్నాయి. దీంతో నీరు, నేల, గాలి కాలుష్యం పెరుగుతోంది. వీటిని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు జారీ చేసిన నిబంధనలు సైతం తుంగలో తొక్కుతున్నారు. కటింగ్‌, పాలీషింగ్‌ సమయంలో ఉత్పత్తి అయ్యే నీరు, రాతి పొడితో కూడిన స్లర్రీ నిల్వ, నిర్వహణ, పారవేయడానికి సంబంధించి ప్రాసెసింగ్‌ యూనిట్లు తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలి, ఇక్కడ అవేవీ కనిపించడం లేదు. భూమిలోకి స్లర్రీ ఇంకకుండా నిరోధించడానికి లైనింగ్‌ చేసిన నిల్వ ప్రాంతాలను నిర్మించుకోవాలి, కానీ అలాంటి నిబంధన ఎక్కడ కానరావడం లేదు. స్లర్రీని నేరుగా భూమిపై లేదా నీటి వనరులలోకి పారేయడం నిషేధం అయినప్పటికీ చెరువుల్లో, ప్రభుత్వ భూముల్లో, ఎక్కడపడితే అక్కడ డంపింగ్‌ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) ఆమోదించిన తమ నిర్వహణ అనుమతి (సీటీఓ)లో భాగంగా యూనిట్లు తప్పనిసరిగా స్లర్రీ వినియోగ ప్రణాళికను సమర్పించాల్సి ఉంది. పరిశ్రమలు జల, వాయు చట్టాల ప్రకారం స్థాపన, నిర్వహణ అనుమతులు పొందుతున్నప్పటికీ ఎక్కడా నిబంధనలకు లోబడి నడుచుకోవడం లేదు. స్లర్రీ ఉత్పత్తి, నిల్వ, రవాణా, తుది వినియోగానికి సంబంధించి వివరణాత్మక రికార్డులను (లాగ్‌బుక్‌లను) తప్పనిసరిగా నిర్వహించాలి. ధూళి వాయు కాలుష్య నివారణకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయంలో నీటిని చల్లాలి, కానీ ఎక్కడ నీటిని చల్లుతున్న దాఖలాలు కనిపించడం లేదు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై రామగుండం కాలుష్య నియంత్రణ బోర్డు ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ బి.భిక్షపతిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా మాట్లాడుతూనే ఫోన్‌ కట్‌ చేసారు. మళ్లీ పలుమార్లు చేసినా స్పందించలేదు.

కమాన్‌పూర్‌ నుంచి ఖాజీపూర్‌ వరకు దుమ్ముతో వేగలేకపోతున్నాం. పంట పొలాల చుట్టు, మార్గంలో ఎక్కడ చూసిన గ్రానై ట్‌ రాతి చూర్ణం(స్లర్రీ) పోయడం వల్ల దుమ్ము లేస్తోంది. నిబంధనల ప్రకారం నీళ్లు చల్లాల్సి ఉండగా ఏ ఒక్క గ్రానైట్‌ పరిశ్రమ పట్టించుకోవడం లేదు. సర్వేనంబర్‌ 122 వక్ఫ్‌భూమిలో డస్ట్‌ డంప్‌లు దర్శనమిస్తున్నాయి. పంటల నష్టంతో పాటు దుమ్ము ధూళితో ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు లేవు. ఇంత నష్టానికి ఓర్చుకున్నా కనీసం ఖాజీపూర్‌ గ్రామస్థులకు సరైన జీవనోపాధి కూడా దొరకడం లేదు.

– పంజాల స్వరూప, ఉపసర్పంచ్‌, ఖాజీపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement