Hyderabad To Bangalore: ఇక ఫాస్ట్‌ ఫాస్ట్‌గా బెంగళూరుకు...

Mahbubnagar To Bangalore Train Big Relief Journey Time Will Reduce - Sakshi

షాద్‌నగర్‌ సమీపంలోని గొల్లపల్లి వరకు డబ్లింగ్‌ పూర్తి 

ఈ ఏడాది చివరికి మహబూబ్‌నగర్‌ వరకు రెండు లైన్లు

కర్నూలు, తిరుపతి, బెంగళూరుకు తగ్గనున్న ప్రయాణ సమయం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది.. కానీ అడుగడుగునా రెడ్‌ సిగ్నల్‌ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఎదురుగా మరో ఎక్స్‌ప్రెస్‌ వస్తుంటే ఏదో ఓ స్టేషన్‌ లూప్‌లైన్‌లో నిలిచిపోవాల్సిందే. గంటలో మహబూబ్‌నగర్‌ చేరుకోవాల్సిన రైలు గంటన్నరకుపైగా సమయం తీసుకుంటుండటం కూడా ఈ సమస్యలో భాగమే. ఇక ఈ విసుగు ప్రయాణానికి కాలం చెల్లింది.

త్వరలో ఈ మార్గంలో అనవసర సిగ్నళ్లులేని ప్రయాణానికి మార్గం సుగమమవుతోంది. తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టులో డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు పూర్తి చేసుకుని సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. డిసెంబరు నాటికి రెండు వరసల మార్గం అందుబాటులోకి రాబోతోంది. ఈ మార్గం పూర్తయితే కర్నూలు, తిరుపతి, బెంగళూరుకు భారీగా ప్రయాణ సమయం తగ్గనుంది.  

ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పనులు.. 
సికింద్రాబాద్‌ నుంచి 113 కి.మీ. దూరంలో ఉన్న మహబూబ్‌నగర్‌కు సింగిల్‌ రైలు మార్గం మాత్రమే ఉంది. కీలక బెంగళూరు మార్గం అయినప్పటికీ దీన్ని రెండు వరుసలకు విస్తరించాలన్న ప్రాజెక్టు కలగానే మిగులుతూ వచ్చింది. ఫలితంగా ఈ మార్గంలో ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌లు నడపాల్సిన డిమాండ్‌ ఉన్నా, నడపలేని దుస్థితి. అత్యంత రద్దీ ఉండే తిరుపతికి కూడా ఈ మార్గంలో అదనపు రైళ్లు వేయాల్సి ఉంది. కానీ సింగిల్‌ లైన్‌ కారణంగా నడపలేని పరిస్థితి. ఈ తరుణంలో రైల్వేశాఖ 2015–16లో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇది పూర్తయితే బెంగళూరుకు దాదాపు గంటన్నర సమయం ఆదా అవుతుంది.

ఇటు హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు ఓ ప్రాజెక్టుగా, అటు డోన్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు మరో ప్రాజెక్టుగా దీన్ని పూర్తి చేసేలా అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో సికింద్రాబాద్‌ నుంచి శంషాబాద్‌ సమీపంలోని ఉందానగర్‌ వరకు 28 కి.మీ. డబ్లింగ్‌ పనులను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించి ఎంఎంటీఎస్‌ రెండో దశలో చేర్చి దాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఉందానగర్‌ నుంచి 85 కి.మీ. దూరంలోని మహబూబ్‌నగర్‌ వరకు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు ప్రారంభించి తాజాగా గొల్లపల్లి వరకు పూర్తి చేశారు. అక్కడి నుంచి మరో 25 కి.మీ. మేర పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులను డిసెంబరులోపు పూర్తి చేసేలా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పర్యవేక్షిస్తున్నారు.  

ఇక రైళ్ల వేగం.. 
దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని పెంచుతూ ఇటీవల రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్వర్ణ చతుర్భుజి, వజ్ర వికర్ణ కారిడార్లలో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, మహబూబ్‌నగర్‌ మార్గంలో సగటు వేగం 60 కి.మీ. నుంచి 80 కి.మీ. దాటడం లేదు. ఇప్పుడు ఈ మార్గంలో రెండో లైన్‌ వస్తే ఏకకాలంలో ఎదురెదురు రైళ్లు ఏదీ నిలిచిపోకుండా పరస్పరం క్రాస్‌ చేసుకునే వెసులుబాటు కలిగింది.

ఇక విద్యుదీకరణ పూర్తి చేయటం వల్ల మరో జాప్యం కూడా తొలగనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ (ఇంజిన్‌)తో వచ్చే రైళ్లు ఈ మార్గంలోకి వచ్చేసరికి ఆగిపోయి డీజిల్‌ ఇంజిన్‌ను తగిలించుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇది కూడా కొంత ఆలస్యానికి కారణమవుతోంది. ఇప్పుడు పూర్తి నిడివి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో నడపొచ్చు. 

చదవండి: వావ్‌.. ఈ రైలు అంత దూరం వెళ్తుందా!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top