సాక్షి, హైదరాబాద్: అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడ సర్కిల్‌కు బదిలీ అయినప్పటికీ, విధుల్లో చేరని డిప్యూటీ కమిషనర్ (డీసీ) శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీ బదిలీల్లో భాగంగా అల్వాల్ డీసీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులను లెక్క చేయకుండా ఆయన విధుల్లో చేరకపోవడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా గతంలో అల్వాల్‌లో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు రాగా, విజిలెన్స్ విచారణ జరిపించారు. అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కవాడిగూడకు బదిలీ అయినా విధుల్లో చేరలేదు.
అల్వాల్ ఉప కమిషనర్‌గా బోగేశ్వర్లు
అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్‌గా పి.బోగేశ్వర్లు నియమితులయ్యారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో మొదట తిప్పర్తి యాదయ్యను నియమించారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు కూడా. కానీ తిరిగి ఒక్కరోజులోనే తిప్పర్తి యాదయ్యను శానిటేషన్ విభాగం జాయింట్ కమిషనర్‌గా యథాస్థానానికి బదిలీ చేశారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.బోగేశ్వర్లును అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్‌గా బదిలీ చేశారు.


