న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయంటే చాలు పోలీసులు అప్రమత్తం అవుతారు. ప్రధానంగా డ్రంకెన్ డ్రైవింగ్‌ని నిరోధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. ఈసారి ఏకంగా వారం రోజుల ముందు నుంచే తనిఖీలు ప్రారంభించారు. ఈ విషయంలో సాధారణంగా పోలీసు కమిషనర్లు కఠినంగా స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ప్రస్తుత కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ మాత్రం రొటీన్‌కు భిన్నంగా, ఎవరూ ‘ఎక్స్’పెక్ట్ చేయని విధంగా ట్వీట్ తూటాలు పేలుస్తున్నారు. వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ జోడిస్తూ నెటిజనులు, సిటీజనుల్ని ఆకర్షిస్తున్నారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా వేదికగా ఆదివారం చేసిన మూడు ట్వీట్లు మందుబాబులు ఉలిక్కిపడేలా, ఇతరులు కడుపుబ్బా నవ్వుకునేలా ఉన్నాయి.
సజ్జనర్ సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో ఈ ట్వీట్ చేశారు. ‘మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు‘ అంటూ స్నేహపూర్వకంగా చెబుతూనే జాగ్రత్తలు సూచించారు. ఇటీవల యువతను సోషల్‌మీడియాలో వస్తున్న మీమ్స్, సెటైర్లు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జనర్ తన హెచ్చరికల్నీ వాటి స్లైల్లోనే జారీ చేస్తున్నారు.
👉‘గూగుల్‌లో లాయర్ కోసం వెతకడం కంటే, క్యాబ్ కోసం వెతకడం మంచిది‘ అని చురకలంటించారు. డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో దొరికిన తర్వాత లాయర్ నెంబర్ కోసం గూగుల్ చేయడం కంటే.. డ్రంక్ డ్రైవింగ్ చేయడానికి ముందే క్యాబ్ నెంబర్ సెర్చ్ చేయమంటూ సూచన ఇచ్చారు. చలాన్లు, జైలు శిక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని, సంబరాలను బాధ్యతయుతంగా జరుపుకోవాలని, లేదంటే ‘యాక్షన్ గ్యారెంటీ’ అని ట్వీట్ ద్వారా తేల్చిచెప్పారు.
👉డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగానే చాలామంది యువకులు పోలీసులకు తమ ‘ప్రతాపం’ చూపిస్తుంటారు. ‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘ అంటూ పరపతి చూపించేందుకు ప్రయతి్నస్తారు. దీనిపై సజ్జనర్ తనదైన శైలిలో స్పందించారు. ‘మీ పరపతి ఏంటో మా ఆఫీసర్లను అడగొద్దు.. మీ ప్రైవసీని మేం గౌరవిస్తాం.. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందాం‘ అంటూ వ్యంగ్యంగా హితవుపలికారు. పరపతి ఎంత ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. కాగా ఆదివారం రాత్రి వరకు లక్షా 90 వేల మంది ఈట్వీట్లను వీక్షించారు.
నెటిజన్ల నుంచి సానుకూల స్పందన...
శిక్షలకు సంబంధించి హెచ్చరికలు, స్పెషల్ డ్రైవ్స్, కోర్టులు, జరిమానాలతో భయపెట్టడమే కాకుండా పోలీసులు ఇలా హాస్యం, వ్యంగ్యం మేళవించి యువతకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తుండటంపై నెటిజనుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఆదివారం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి. మొత్తానికి న్యూ ఇయర్ వేళ మందుబాబులు ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే.. కొత్త సంవత్సరం కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని సజ్జనర్ తనదైన శైలిలో గట్టిగానే హెచ్చరిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.
ద


