పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా | Sakshi
Sakshi News home page

Teachers Promotions: పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా

Published Thu, Aug 31 2023 2:43 AM

Legal dispute over teachers promotions and transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బదిలీలు, పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విద్యాశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. కొన్నేళ్లు గా ఎదురుచూస్తున్న టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొన్ని నెలల క్రితం విధించిన స్టేకి హైకోర్టు బుధవారం సడలింపు ఇచ్చింది. దీంతో తక్షణమే ప్రక్రియను మొదలుపెట్టాలని విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే విధివిధానాలపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన డేటా, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ఎనిమిదేళ్లుగా నోచుకోని పదోన్నతులు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, దాదాపు 6 వేల మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత ప్రమోషన్ల వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2021లో బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా కోవిడ్‌ దృష్ట్యా ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు బదిలీలు చేపట్టడం అనేక వివాదాలకు దారితీసింది. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల్లో 6,362 మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. 7,141 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. ఇందులో 30 శాతం నేరుగా టీఆర్టీ ద్వారా భర్తీ చేయనుండగా, 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. హెచ్‌ఎం పోస్టులు 1,947 ఖాళీలుండగా, ఇందులో పదోన్నతులతో భర్తీ చేసేందుకు 1,367 మంది అర్హులని లెక్కతేల్చారు. ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంల పోస్టులు 2,043 ఖాళీలుంటే, 1,942 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇతరత్రా కలుపుకొంటే మొత్తం 10,352 మంది టీచర్లకు పదోన్నతులు లభించే వీలుంది.  

బదిలీలకు 50 వేల మంది 
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో సాధారణ బదిలీలు చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసే హెచ్‌ఎంలు, 8 ఏళ్లుగా ఒకేచోట పనిచేసే టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. 2018లో 78 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 48 వేల మందికి బదిలీలు జరిగాయి. గత జనవరిలో బదిలీల షెడ్యూల్‌ ఇవ్వగా.. 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా షెడ్యూల్‌ ఇస్తే 8 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగే అవకాశముంది. వీరిలో సీనియారిటీ, సర్వీస్‌ పాయింట్ల ప్రాతిపదికన 50 వేల మంది బదిలీ అయ్యే వీలుంది. 

కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు? 
ఆన్‌డ్యూటీ తీసుకునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సరీ్వస్‌ పాయింట్లపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా షెడ్యూల్‌లో ఈ పాయింట్లను తొలగించాల్సి ఉంది. దీంతో గత జనవరిలో మొదలు పెట్టిన బదిలీల ప్రక్రియలో మార్పులు చేసి ప్రభు త్వం కొత్త షెడ్యూల్‌ ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. హెచ్‌ఆర్‌ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా సరీ్వసు పాయింట్లు ఇస్తారు. దీంతోపాటే సరీ్వస్‌ను బట్టి కొన్ని పాయింట్లు ఇస్తారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జిల్లాల వారీగా సీనియారిటీ, సబ్జెక్టుల వారీగా సీనియారిటీని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, షెడ్యూల్‌ మాత్రం వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  

టీఆర్టీకి పోస్టులు పెరుగుతాయా? 
విద్యాశాఖలో 22 వేల ఖాళీలుంటే, ప్రభుత్వం కేవలం 5,089 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా పదోన్నతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త ఖాళీలు వెల్లడయ్యే వీలుంది. మొత్తం 10 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఐదువేలతో కలుపుకొంటే మొత్తం 15 వేలకుపైగా నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. 

ఇప్పటికైనా మోక్షం కల్పించండి: ఉపాధ్యాయ సంఘాలు 

  • కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తక్షణమే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్‌ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. 
  • న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామని పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ రావు తెలిపారు.   
  • ఏళ్ల తరబడి టీచర్లు బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం షెడ్యూల్‌ ఇవ్వాలని పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. 
  • ఉపాధ్యా సంఘాల నేతలు పది ప్రత్యేక పాయింట్లు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఎస్టీయూ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్‌రెడ్డి కోరారు. 

Advertisement
Advertisement