
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్‌మెంట్ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ..
అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు.
నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్ విసిరారు.