ఎర్రగడ్డ డివిజన్‌లోని కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఎన్నికల హామీల అమలుపై సీఎం నోరు మెదపట్లేదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
జూబ్లీహిల్స్‌లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయంటూ మండిపాటు
ఎర్రగడ్డ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం.. ఈసారి బీజేపీని గెలిపించాలని వినతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్రగా అందరినీ పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచి్చన హామీలను అమలు చేయట్లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేక దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా గుంతల రహదారులు, పొంగుతున్న మురుగు కాల్వలు, వెలగని వీధి దీపాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు.
నియోజకవర్గానికి చుట్టూ ఉన్న కూకట్‌పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలు గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందినప్పటికీ జూబ్లీహిల్స్ మాత్రం అలాగే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలు.. ఈసారి బీజేపీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల్లా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని.. తమ నిజాయతీనే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల గూండాయిజం, రౌడీయిజాన్ని అంగీకరించబోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ ప్రభావం లేదని.. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపించట్లేదని అన్నారు. మజ్లిస్ ఓట్లపై నమ్మకంతోనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే మజ్లిస్ నుంచి అభ్యర్థి ని తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉంటాడని.. ఆయనకు ఒక్క ఫోన్ కాల్ చేయగానే ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండి నడుస్తాడని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.


