కథక్‌ నృత్య కళాకారిణి మంగళాభట్‌ కన్నుమూత | Kathak danseuse Mangala Bhatt passes away in Hyderabad | Sakshi
Sakshi News home page

కథక్‌ నృత్య కళాకారిణి మంగళాభట్‌ కన్నుమూత

Jun 17 2025 11:05 AM | Updated on Jun 17 2025 11:23 AM

Kathak danseuse Mangala Bhatt passes away in Hyderabad

బంజారాహిల్స్‌: ప్రఖ్యాత కథక్‌ నృత్య కళాకారిణి నాట్య గురు మంగళాభట్‌ (62) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైటెక్‌ సిటీలోని సింధు ఆస్పత్రిలో ‘ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు. ప్రముఖ కథక్‌ నాట్యగురు రాఘవరాజ్‌భట్‌ సతీమణి మంగళాభట్‌ విఖ్యాత జానపద కళా బ్రహ్మ గోపాల్‌రాజ్‌ పేరుతో గత 35 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఎందరినో కథక్‌ నాట్యంలో తీర్చిదిద్దారు. ఆమె భర్త రాఘవరాజ్‌భట్‌ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్‌గా సేవలు అందిస్తున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని మిథిలానగర్‌లోని ఆమె స్వగృహంలో కళా ప్రేమికులు, బంధుమిత్రులు సందర్శనార్థం ఉంచి, జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంగళా భట్‌ (మంగళా కులకర్ణి) మృతి పట్ల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement