కాంగ్రెస్‌ నాయకులారా ఖబడ్దార్‌.. కేసీఆర్‌కు నోటీసులిస్తారా? | Kalvakuntla kavitha during the dharna held at Indira Park | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాయకులారా ఖబడ్దార్‌.. కేసీఆర్‌కు నోటీసులిస్తారా?

Jun 5 2025 1:16 AM | Updated on Jun 5 2025 1:16 AM

Kalvakuntla kavitha during the dharna held at Indira Park

16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచినందుకా ఈ నోటీసులు?  

కాళేశ్వరం కమిషన్‌ కాదు... అది కాంగ్రెస్‌ కమిషన్‌  

ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సాక్షి, హైదరాబాద్‌/కవాడిగూడ: తెలంగాణ సస్యశ్యామలం కావాలని 16 టీఎంసీల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును 141 టీఎంసీలకు పెంచినందుకా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసు­లు ఇచ్చారా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ­కుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడ­మంటే యావత్‌ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచి్చనట్టేనని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌తో నోటీసులు జారీ చేయించిన కాంగ్రెస్‌ నాయకులా­రా ఖబడ్దార్‌ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమి­షన్‌ కాదు..అది కాంగ్రెస్‌ కమిషన్, రాజకీయ కమిషన్‌ అని విమర్శించారు. 

కమిషన్‌పై మాకు నమ్మకం ఉందని, కాంగ్రెస్‌ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జాగృతి కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భం­గా కవిత ప్రసంగించారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్‌ వేశారని విమర్శించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం కమీషన్ల కో­సం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని, 90 శాతం పంప్‌హౌస్‌ల పనులు చేసిన కాంట్రాక్టర్‌ను ఎందుకు వదిలేశా­రో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు­లో 15 పంప్‌హౌస్‌లు నిర్మించిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్‌ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్‌ చేశారు.  

చంద్రబాబు జలదోపిడీ చేసినా బీజేపీ ప్రశ్నించడం లేదు  
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడీ చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్‌ కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని, తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్‌ ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు.  

Advertisement
 
Advertisement
Advertisement