రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పథకం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన
చింతకాని: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతో పాటు ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం కల్పిస్తున్న తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురానుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ‘ఇందిరమ్మ బీమా’పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం 1.06 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తుండటం దేశంలోనే మోడల్‌గా నిలుస్తోందన్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్‌తో ఆదివారం శంకుస్థాపన చేసిన ఆయన.. ఆ తర్వాత బోనకల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. అనంతరం చింతకానిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ)తో సమావేశమయ్యారు. ఆయా కార్యక్రమాల్లో భట్టి మాట్లాడారు. పదేళ్లలో అభివృద్ధి జరగక వెనుకబడిన మధిర నియోజకవర్గాన్ని కాలంతో పోటీ పడుతూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రానున్న రెండేళ్లలో పాఠశాలలు, రోడ్లు, ఆస్పత్రులు నిర్మించి నాయకులు గ్రామాల్లో తలఎత్తుకొని తిరిగేలా చేస్తామన్నారు.
చిరు వ్యాపారులను పలకరించి.. టీ తాగి..
ముదిగొండ: ముదిగొండ కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి, రోడ్డు వెడల్పు పనులను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యతపై సూచనలు చేసిన ఆయన ఓ టీస్టాల్ వద్ద టీ తాగుతూ స్థానికులతో మాట్లాడారు. చిరు వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఓ మహిళ అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పగా స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సహకరించాలని సర్పంచ్‌కు చెప్పారు. అలా గే, చెప్పులు కుట్టుకునే పల్లె నాగభూషణం కుమారుడికి రాజీవ్ యువ వికాసం కింద రూ లక్ష మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


