ఇక్కడ చోరీ చేసి ఒడిశాలో మాఫియాకు అప్పగింత
అందుకు బదులుగా గంజాయి
తీసుకొచ్చి అధిక ధరతో విక్రయాలు
ఖమ్మంక్రైం: గతంలో జిల్లాలో ఎక్కడ ద్విచక్రవాహనాల చోరీ జరిగినా నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో అమ్మేవారు. దీంతో రికవరీ కూడా పోలీసులకు సులువుగా ఉండేది. ఆతర్వాత నిందితులు అడ్డా మార్చి ఇతర ప్రాంతాల్లో అమ్మడం మొదలుపెట్టారు. అయితే, ఇటీవల చోరీ అవుతున్న వాహనాలు మాత్రం ఒడిశాకు చేరుతున్నాయి. వాహనాలను అక్కడకు తీసుకెళ్లి గంజాయి మాఫియాకు అప్పగించి ఆ వాహనం విలువకు సరిపడా గంజాయి తీసుకొస్తున్న నిందితులు ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిసింది. కొద్దినెలలుగా ౖచోరీ కేసుల విచారణలో పోలీసులు ఈ విషయాన్ని గుర్తించినట్లు సమాచారం.
జిల్లాలో పలువురు యువత గంజాయికి బానిసలై, ఆ తర్వాత డబ్బు కోసం అమ్మకాలు మొదలుపెడుతున్నట్లు తెలిసింది. ఈక్రమాన గంజాయికి కావాల్సిన నగదు కోసం కొందరు బైక్‌ల చోరీ పాల్పడుతున్నట్లు సమాచారం. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాళ్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు చోరీ చేస్తున్నారు. ఈమేరకు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా నిందితులు ఎక్కువ మంది యువకులే ఉన్నట్టు గుర్తించారు. ఈక్రమాన మరింత లోతుగా విచారణ చేపట్టడం.. ఇటీవల పట్టుబడిన ఓ వ్యక్తిని విచారించగా చోరీ చేసిన బైక్‌లను ఒడిశాకు తీసుకెళ్తున్నట్లు బయటపడింది.
యువకులు తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం కంపెనీ, మోడల్ ఆధారంగా అక్కడి మాఫియా ధర నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ఆ ధర ఆధారంగా గంజాయి ఇస్తున్నారని సమాచారం. అయితే, కొందరు మాత్రం రూ.లక్ష విలువైన బైక్‌కు కూడా రూ.20వేలకు మించి గంజాయి ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. అయినా గంజాయికి అలవాటు పడిన యువత ఇక్కడకు తీసుకొచ్చి, ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది.
జిల్లాలో గత ఏడాది 170 ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి. ఇందులో 103 బైక్‌లను పోలీసులు రికవరీ చేశారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు 105 బైక్‌లు చోరీ అయితే 51 మాత్రమే రికవరీ చేయగలి గారు. నిందితులు ఎక్కువగా ఒడిశా రాష్ట్రానికి తీసుకెళ్లి అమ్ముతుండడంతో గుర్తింపు, రికవరీ ఆలస్యమవుతోందని సమాచారం. ఇటీవల పట్టుబడిన ఓ నిందితుడి ద్వారా విషయం తెలియడంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
జిల్లాలో బైక్‌ల చోరీ వెనుక గంజాయి లింక్‌లు


