● మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మే నెలలోనే మార్గదర్శకాలు ● అయినా వివరాల సేకరణ, డిజిటల్ మ్యాపింగ్‌లో జాప్యం ● చివరి అవకాశంగా మళ్లీ సీడీఎంఏ ఉత్తర్వులు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని పురపాలక, నగర పాలక సంఘాల్లో ఆస్తుల లెక్కింపు, రక్షణ ప్రక్రియలో తీవ్రజాప్యం జరుగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి ఖాళీ స్థలాలు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్క్‌లు, నీటి వనరులను గుర్తించి.. డిజిటల్ మ్యాపింగ్, జియో–ట్యాగింగ్ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ(సీడీఎంఏ) మే నెలలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో ప్రక్రియ కనీస స్థాయిలో జరగలేదు. దీంతో ఈనెల 17న మళ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులను మాత్రమే ఇప్పటివరకు ఆన్‌లైన్ చేయగా... ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇతర మున్సిపాలిటీల్లో వివరాలు ఇంకా సేకరించలేదు.
లక్ష్యం మంచిదే..
పుర, నగర పాలక సంఘాల పరిధిలో రూ.కోట్ల విలువైన ఆస్తుల వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేయడం, ఆక్రమణలను అరికట్టడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మున్సిపల్ అసెట్ మేనేజ్‌మెంట్’ ప్రాజెక్టు రూపొందించింది. ఆస్తుల వివరాలను జియో–ట్యాగింగ్ చేయడం, క్యూఆర్ కోడ్ ఆధారిత సరిహద్దుల నిర్ణయం, ప్రతీ ఆస్తికి యూనిక్ ఐడీ కేటాయించడం వంటివి చేయాల్సి ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం), డ్రీమ్‌స్టెప్ సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నారు.
జాప్యంపై ఆగ్రహం
ఉత్తర్వులు ఇచ్చినెలలు దాటుతున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తాజా ఆదేశాల ప్రకారం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తుల వివరాల ప్రాథమిక సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. ఆ వివరాలను అకౌంట్స్ విభాగ అధికారులు ప్రత్యేక ఫార్మాట్‌లో నమోదు చేసి ఆమోదించిన, ఆమోదం లేని లే ఔట్లు, పాత రికార్డుల స్కాన్ కాపీలను గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా పంపాలని సూచించారు. అంతేకాక ‘మున్సిపాలిటీ పరిధిలోని ఏ ఒక్క ఆస్తి కూడా విడిచిపెట్టలేదు, అన్ని వివరాలనూ సరిగ్గా నమోదు చేశాం’ అని కమిషనర్లు సంతకం చేసిన సర్టిఫికెట్ ఇవ్వడం తప్పనిసరి చేశారు.
ప్రజాధనానికి రక్షణ దక్కేనా?
ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోని కౌన్సిల్ భవనాలు, ఓపెన్ ప్లాట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లు, పార్కులకు సరైన రికార్డులు లేక ఆక్రమణల పాలవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యాన ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మ్యాపింగ్ విధానంతో రక్షణ లభించనుంది. కానీ అధికారుల ఉదాసీనత వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలతోనైనా అధికారులు స్పందిస్తారో, లేదో వేచి చూడాల్సిందే.
‘సర్’ విధుల్లో..
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు ‘సర్’ విధుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యాన గతంలోనే పూర్తి చేయాల్సిన ఆస్తుల లెక్కింపు పనులను చేపట్టకపోవడంతో ఒత్తిడి ఎదురవుతోంది. అటు ‘సర్’ విధులను చూడాలా.. ఇటు ఆస్తుల లెక్కించాలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఆస్తుల లెక్కింపు చేపట్టగా.. 643 ప్రాంతాల్లోని స్థలాలకు సంబంధించి 594.83 ఎకరాల స్థలం, 300 భవనాలకు సంబంధించి 80,46,403 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాల నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. వీటి విలువ రూ.3,905.11 కోట్లుగా ఉంటుందని ఆ కార్పొరేషన్ అధికారులు లెక్కించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా దాదాపు అదే స్థాయిలో ఆస్తులు ఉంటాయనే చర్చ జరుగుతుంది. ‘సర్’ విధుల్లో ఉన్న అధికారులు మున్సిపల్ ఆస్తుల లెక్కింపు ఏ మేర పూర్తి చేస్తారో చూడాలి.


