బరాజ్‌ల పునరుద్ధరణ ఖర్చు సర్కారుదే! | Telangana govt bears cost of barrage renovation | Sakshi
Sakshi News home page

బరాజ్‌ల పునరుద్ధరణ ఖర్చు సర్కారుదే!

Sep 28 2026 2:43 AM | Updated on Sep 28 2026 2:43 AM

Telangana govt bears cost of barrage renovation

వ్యయం భరించేందుకు నిర్మాణ సంస్థల విముఖత 

తొలుత వ్యయం తామే భరించాలని సర్కారు యోచన 

ఆ తర్వాత నిర్మాణ సంస్థల నుంచి రికవరీకి చర్యలు 

మేడిగడ్డ 7వ బ్లాక్‌ తొలగించాలా? ఎన్‌ఓఎఫ్‌ డ్యామ్‌గా మార్చాలా? 

ప్రభుత్వ పరిశీలనలో రెండు ప్రత్యామ్నాయాలు 

వచ్చే వానాకాలం నాటికి అన్నారం, సుందిళ్లను సిద్ధం చేసే యోచన  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది! పునరుద్ధరణ ప్రక్రియలో మరింత జాప్యం జరగకుండా నివారించడానికి ప్రభుత్వం ఈ మేరకు యోచిస్తోంది. వాస్తవానికి బరాజ్‌ల పునరుద్ధరణ వ్యయాన్ని పూర్తిగా నిర్మాణ సంస్థలే భరించాల్సి ఉంటుందని గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. పునరుద్ధరణ బాధ్యతలు స్వీకరించి వ్యయాన్ని పూర్తిగా భరించాలంటూ ప్రాజెక్టు ఇంజనీర్లు పదుల సంఖ్యలో నిర్మాణ సంస్థలకు ఉత్తరాలు రాయగా, పునరుద్ధరణ చర్యలకు సహకరిస్తామంటూనే వ్యయం విషయంలో తమ బాధ్యత ఉండబోదని స్పష్టం చేశాయి. వచ్చే అక్టోబర్‌ 21తో మేడిగడ్డ బరాజ్‌ కుంగిపోయి మూడేళ్లు పూర్తికానుంది. బరాజ్‌ల పునరుద్ధరణలో భాగంగా వాటిలో లోపాలను గుర్తించడానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసు చేసిన వివిధ రకాల పరీక్షలను బరాజ్‌ల నిర్మాణ సంస్థల పర్యవేక్షణలోనే జరిగినా, వాటికైన వ్యయాన్ని ప్రభుత్వమే భరించింది. 

బరాజ్‌ల పునరుద్ధరణ పనుల వ్యయాన్ని తొలుత తామే భరించి ఆ తర్వాత నిర్మాణ సంస్థల నుంచి రికవరీ చేసేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యయాన్ని భరించేందుకు నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడంతో ప్రభుత్వమే భరించక తప్పనిపరిస్థితి ఏర్పడింది. బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లకు తుది రూపం ఇచ్చి అక్టోబర్‌ 5లోగా అందజేస్తామని డిజైన్‌ కన్సల్టెన్సీ ఆఫ్రీ ఇండియా సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఆ తర్వాత డిజైన్లకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పునరుద్ధరణ పనులకు అంచనాలు రూపొందించి పరిపాలనపర అనుమతులు జారీ చేయనున్నారు.  

ఎన్‌ఓఎఫ్‌ డ్యామ్‌గా మేడిగడ్డ ఏడో బ్లాక్‌! 
మేడిగడ్డ బరాజ్‌ ఏడో నంబర్‌ బ్లాక్‌ కుంగిపోయిన నేపథ్యంలో దాన్ని పూర్తిగా తొలగించి కొత్త బ్లాక్‌ నిర్మించాలా? లేక ఆ బ్లాక్‌ను నాన్‌ ఓవర్‌ ఫ్లో(ఎన్‌ఓఎఫ్‌) డ్యామ్‌గా మార్చాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్‌ఓఎఫ్‌ డ్యామ్‌గా మార్చాలని నిర్ణయిస్తే ఏడో బ్లాక్‌ గేట్లను తొలగించి పూర్తిగా కాంక్రీట్‌ గోడగా పటిష్టం చేస్తారు. దీంతో ఆ మేరకు బరాజ్‌ నుంచి నీళ్లను కిందికి విడుదల చేసే సామర్థ్యం తగ్గిపోనుంది. ప్రత్యామ్నాయంగా బరాజ్‌లకి ఎగువన రెండు వైపులా వరద మళ్లింపు కాల్వలను నిర్మిస్తారు. ఏడో బ్లాక్‌ పూర్తిగా తొలగించి కొత్త బ్లాక్‌ నిర్మించడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. దానిని తొలగించే సమయంలో ఇరువైపులా ఉన్న బ్లాకులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏడో బ్లాక్‌ను ఎన్‌ఓఎఫ్‌ డ్యామ్‌గా మార్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది.  

బరాజ్‌లకు దిగువన డయాఫ్రమ్‌వాల్‌ 
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకి రక్షణగా సికెంట్‌ పైల్స్‌ టెక్నాలజీతో నిర్మించిన పునాదులు నూటికి నూరు శాతం పనికి రావని పరీక్షల్లో తేలిందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. సికెంట్‌ పైల్స్‌ విఫలం కావడంతోనే గతంలో బరాజ్‌ల పునాదుల కింద బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకయ్యాయి. బరాజ్‌లకి ప్రత్యామ్నాయ రక్షణగా దిగువన కొంత దూరంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని డిజైన్‌ కన్సల్టెన్సీ సిఫారసు చేసింది. సికెంట్‌ పైల్స్‌ విఫలమైనందున డయాఫ్రమ్‌వాల్‌ పునాదుల (కటాఫ్‌వాల్స్‌)ను షీట్‌పైల్స్‌ టెక్నాలజీతో నిర్మించనున్నారు. మూడు బరాజ్‌ల పునాదుల కింద భారీ సంఖ్యలో బుంగలున్నట్టు గుర్తించగా, వాటిని గ్రౌంటింగ్‌తో పూడ్చివేయాలని నిర్ణయించారు.  

పునరుద్ధరణకు రూ.1,500 కోట్లు? 
మేడిగడ్డ బరాజ్‌ తుది అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఏడో బాŠల్‌క్‌ పునర్నిర్మాణానికి రూ.500కోట్ల వ్యయం కానుందని అంచనా. మూడు బరాజ్‌లకు దిగువన మూడు డయాఫ్రమ్‌ వాల్స్‌ నిర్మించాల్సి ఉండగా, ఒక్కో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి సుమారు. 300 కోట్లు కానుందని భావిస్తున్నారు. బుంగలను పూడ్చివేయడానికి గ్రౌటింగ్, ఇతర మరమ్మతులు కలిపి బరాజ్‌ల పునరుద్ధరణకు ప్రాథమికంగా రూ.1500 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలోని బుంగలను గ్రౌటింగ్‌తో పూడ్చివేసి వాటిలో నీళ్లను నిల్వ చేసే అవకాశాన్ని పరిశీలించాలని పభుత్వం భావిస్తోంది. వచ్చే వానాకాలంలోనూ కరువు పరిస్థితులు కొనసాగితే అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ బరాజ్‌లో తీవ్ర సమస్యలుండటంతో పునరుద్ధరణకు అధిక సమయం పట్టే అవకాశం ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement