ఎండలకు బ్రేక్‌.. తెలంగాణపై వర్షాల మోత | IMD Big Alert To Telangana Along Hyderabad Heavy Rains | Sakshi
Sakshi News home page

ఎండలకు బ్రేక్‌.. తెలంగాణపై వర్షాల మోత

Jun 6 2026 9:09 AM | Updated on Jun 6 2026 9:19 AM

IMD Big Alert To Telangana Along Hyderabad Heavy Rains

మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న కీలక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరానికి సమీపంలో మధ్య ట్రోపోస్ఫియర్‌ స్థాయిలో భారీ వాయుగుండం (మిడ్‌ ట్రోపోస్ఫెరిక్‌ వోర్టెక్స్‌) ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కేరళ తీరం నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఏర్పడ్డాయి.

ఈ ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక కేరళ, తీర కర్ణాటక ప్రాంతాల్లో జూన్‌ 10-11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అక్కడ ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపైనా కనిపించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement