ఖరీఫ్‌.. బహుపరాక్‌! | ICAR says rice yield likely to decline with El Nino | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌.. బహుపరాక్‌!

Jun 27 2026 1:48 AM | Updated on Jun 27 2026 1:48 AM

ICAR says rice yield likely to decline with El Nino

కోతులనడుమలో...

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎల్‌నినో హెచ్చరిక

వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న ఐసీఏఆర్‌ 

పంట సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణకు సూచన 

వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలు ఎంపిక చేసుకోవాలంటున్న క్రిడా  

నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి.. మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వేయాలని వెల్లడి

వాన కోసం..
వర్షాలు కురవాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం, ఎల్కతుర్తి మండలం సూరారం, కోతులనడుమ, ఆరెపల్లి, కమలాపూర్‌ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం మహిళలు, గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ మహిళలు బోనాలు, నీటిబిందెలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. గ్రామదేవతలు పోచమ్మ తల్లి, రేణుకాఎల్లమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– ఎల్కతుర్తి/భీమదేవరపల్లి/కమలాపూర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో వరి సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించింది. గతంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపిన సంవత్సరాల్లో నమోదైన దిగుబడి నష్టాలను విశ్లేషించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) అన్ని రాష్ట్రాలకు జిల్లాల వారీ కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌ (క్రిడా) కూడా ఇప్పటికే తెలంగాణ సహా వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలతో సమీక్షలు నిర్వహిస్తూ రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది.  

గత కరువుల ఆధారంగా విశ్లేషణ 
ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎక్కువ నష్టం చవిచూసిన జిల్లాలను గుర్తించేందుకు ఐసీఏఆర్‌ 2002, 2004, 2009 సంవత్సరాల వ్యవసాయ ఉత్పత్తి గణాంకాలను పరిశీలించింది. ఈ మూడేళ్లలో దేశంలో తీవ్రమైన వర్షాభావం నమోదైంది. తెలంగాణలోనూ కరువు ప్రభావం అధికంగా కనిపించింది. సాధారణంతో పోలిస్తే 2002లో 19%, 2004లో 13%, 2009లో 23% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో 2002లో ఖరీఫ్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 శాతానికి పైగా తగ్గగా, 2004, 2009లో సుమారు 12 శాతం చొప్పున తగ్గింది. ఈ అధ్యయనం ఆధారంగానే కేంద్రం ముందస్తు కార్యాచరణ సూచనలు జారీ చేసింది. 


వరి అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాల్లో.. 
దేశంలో ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ముఖ్యంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌ వంటి సాగునీటి వనరులు పెరిగినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటిపోతాయి. వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామం ఏర్పడితే, అవసరమైన సమయంలో నీరందక వరి పొలాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల కింద ఉండే చివరి ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం రోజుల్లో సైతం నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు ఉత్తర తెలంగాణలో వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐసీఏఆర్‌ హెచ్చరించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగుతో పాటు పశ్చిమ తెలంగాణ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట వంటి ప్రధాన వరి జిల్లాలపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు తేల్చింది.  

క్రిడా.. కీలక సూచనలు  
హైదరాబాద్‌లోని క్రిడా రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళికల్లో రైతులు అనుసరించాల్సిన పలు కీలక సూచనలు ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేయడం, అవసరమైతే మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, పుషి్పంచే దశలో రక్షణ నీటి తడులు ఇవ్వడం, ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయడం ఇందులో ఉన్నాయి. గ్రామస్థాయిలో విత్తన నిల్వలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి 24 వరకు సాధారణంతో పోలిస్తే సుమారు 42 శాతం వర్షలోటు నమోదైంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 21 శాతం ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి కొనసాగితే ఖరీఫ్‌ సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement