మంత్రి కేటీఆర్‌ మెడిసిన్‌ ఎందుకు చదవలేకపోయారంటే..?

I Did Not Get Medical Seat Because KTR At Sircilla Medical College Opening - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో తొమ్మిది మెడికల్‌ కాలేజీలను వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్‌రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభించినందుకు సెస్ కార్యాలయం నుంచి సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా అంబేద్కర్‌ చైరస్తాలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 1993లో తాను కూడా బైపీసీ పూర్తిచేసినట్లు తెలిపారు. అమ్మ తనను డాక్టర్‌ చేయాలనుకుంటే.. నాన్న నేను ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకున్నారని ఆనాటి రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు ఎంసెట్‌లో 1600 ర్యాంక్‌ వచ్చినా.. మెడికల్‌ సీటు రాలేదని తెలిపారు.  కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని.. తెలంగాణాలో 10000 మంది వైద్యులు ప్రైవేట్& ప్రభుత్వ కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు.

డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు తెలంగాణలో వచ్చాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పీజీ విద్య మన జిల్లాలోనే(సిరిసిల్ల) ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవని విమర్శించారు. 
చదవండి: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా? 

‘మొన్నటి దాకా డాక్టర్ల కొరత వుండేది.  ఇప్పుడు మెడికల్ కాలేజ్ వల్ల కేవలం సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లున్నారు. గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారు. వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలను ఏర్పాటు చేస్తాం. మోదీ లాంటి వాళ్ళు  సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మాకు బాసులు ఎవరూ లేరు. ప్రజలే మాకు బాసులు. 

కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి? వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ వాళ్లనడగాలి.సిరిసిల్లలో నన్ను, వేములవాడలో లక్ష్మీనరసింహారావును మంచి మెజారిటీతో గెలిపించండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ తెలిపారు మంత్రి కేటీఆర్‌.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top