ఖైదీల హక్కులు, వసతుల కల్పనకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కృషి 2025 నుంచి ఇప్పటి వరకు.. 84 సార్లు జైలు సందర్శన ఉచిత న్యాయం కోసం దరఖాస్తుల స్వీకరణ
జగిత్యాలజోన్: తెలిసో తెలియకో పలువురు తప్పు చేసి జైలులో ఖైదీలుగా జీవితం వెల్లదీస్తున్నారు. ఈనేపథ్యంలో జైలులో ఖైదీలకు అందుతున్న వసతుల గురించి తెలుసుకునేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ విశేష కృషి చేస్తుంది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మా ణ్యశర్మ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు జగిత్యాల స్పెషల్ సబ్ జైలును సందర్శిస్తున్నారు. జగిత్యాల జైలులో దాదాపు 50–60 మంది రిమాండ్ ఖైదీలు ఉంటారు.
ఏడాదిలో 84 సార్లు సందర్శన
జిల్లా కేంద్రంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏడాదిలో 84 సార్లు సందర్శించారు. 2023లో 24 సార్లు, 2024లో 74 సార్లు, 2025లో 76 సార్లు, 2026లో 8 సార్లు జైలును సందర్శించారు. ప్రతి శనివారం జైలులో ఖైదీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో చర్చావేదికలు కొనసాగిస్తున్నారు. నేరం ఎందుకు చేయాల్సి వచ్చింది, జైలుకు ఎలా వచ్చామనే విషయాల గురించి న్యాయమూర్తులు తెలుసుకుంటున్నారు. నేరాలకు పాల్పడం వల్ల జీవితంలో ఏమి కోల్పోతున్నారో, కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నం అవుతున్నాయో ఖైదీలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఖైదీల హక్కులు, విధుల గురించి వివరిస్తున్నారు. జైలు సిబ్బందికి ఎలా సహకారం అందించాలో కూడా సూచిస్తున్నారు.
వసతుల పరిశీలన
జైలులో వసతుల గురించి ఖైదీలు, సిబ్బందిని అడిగి తెలుసుకుంటారు. అలాగే, జైలుకు రాగానే జడ్జిలు ప్రధానంగా భోజనశాల, ఖైదీలకు అందించే భోజనాన్ని పరిశీలిస్తుంటారు. జైలును పరిశుభ్రంగా ఉంచాలని, ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మార్చాలని చెబుతుంటారు. ఖైదీలకు రోజువారీగా ఇచ్చే మెనూ తెలుసుకుంటారు. ప్రధానంగా ఖైదీల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యుడిని పిలిచేలా, అవసరమైతే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సిబ్బందికి అదేశాలు జారీ చేస్తుంటారు.
ఉచిత న్యాయం కోసం దరఖాస్తులు
కోర్టుల్లో కేసులు వాదించడానికి న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయం అందిస్తున్నారు. ఉచిత న్యాయం కోసం ఖైదీల నుంచి జిల్లా న్యాయ సేవా సంస్థ దరఖాస్తులు స్వీకరిస్తుంది. పోలీసులతో సమన్వయం చేసుకుని, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు ఆయా కోర్టుల్లోని ఖైదీల కేసులను వాదిస్తున్నారు. దీనికి తోడు, ఖైదీల్లో మానసిక ధృడసంకల్పం పెంపొందించేందుకు జైలులోపల ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తారు. జైలు గోడల మధ్య ఖైదీల్లో మానసిక పరివర్తన తెచ్చి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఉత్తములుగా ఉండేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచిస్తుంటారు.


