● బందోబస్తు మధ్య గోదావరిఖని కోర్టులో హాజరు
గోదావరిఖని: సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ నిందితుడిని చెన్నయ్ పోలీసులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి తీసుకొచ్చారు. 2024 ఫిబ్రవరిలో స్థానిక గంగానగర్, గౌతమినగర్ ఏటీఎంలలో చోరీ జరిగింది. అదే సమయంలో పోలీస్ సైరన్ మోగడంతో గంగానగర్‌లో చోరీ విఫలమైంది. అయితే, గౌతమినగర్ ఏటీఎంలో సుమారు రూ.25లక్షలు చోరీకి గురయ్యాయి. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన వారికోసం విచారణ జరపగా.. నిందితుడు చెన్నయ్ పోలీసులకు చిక్కాడు. విచారణలో గౌతమినగర్ ఏటీఎంలో చోరీచేసినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చేందుకు ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఎస్కార్ట్ పోలీసుల మధ్య కోర్టులో హాజరు పర్చిన అనంతరం శుక్రవారం రాత్రి రైలులో మళ్లీ చెన్నయ్ తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏటీఎం చోరీల్లో సుమారు రూ.5కోట్లకుపైగా నిందితుడు తస్కరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈమేరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుడిని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా ‘సాక్షి’ కెమెరా ఆ దృశ్యాన్ని బంధించింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారు పెట్రోల్‌బంకు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్డు సత్యనారాయణ(55) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన సత్యనారాయణ తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తంగళ్లపల్లి నుంచి కేసీఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలేరో పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు సంతానం ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘పది’ ఇంటర్నల్ మార్కులలో ఇష్టారాజ్యం !
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో విద్యనభ్యశిస్తున్న పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను కేటాయించే విధానం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధానం ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు దోహదపడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులుండగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాత్ర ఫుల్లుగా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు జిల్లా విద్యాశాఖ తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తనిఖీ బృందాల్లో స్కూళ్లలోకి వెళ్లి మార్కులను పరిశీలించాయి. ఈ విధానంతో కొన్ని విద్యాలయాలు విద్యార్థులు పాఠశాలకు హాజరుకాకున్నా పరిశీలన బృందాలు వచ్చే సమయానికి ఉండేలా చూస్తూ మార్కులను నమోదు చేస్తున్నట్లు తెలిసింది.
26 బృందాలు.. 74 పాఠశాలలు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 74 పాఠశాలల్లో 7,317 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరందరికీ ఆరు సబ్జెక్టులకు రాతపరీక్షలు జరుగునున్నాయి. రాతపరీక్షకు 80 మార్కులు ఉండగా, ఇంటర్నల్ 20 మార్కులు ఉంటాయి. ఇంటర్నల్ మార్కులకు ఇవ్వడానికి విద్యార్థులు రాసిన క్లాస్‌వర్క్, 4 ఫార్మటీవ్ అసెస్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులను సగటు వేసి మార్కులు ఇవ్వాలి. కానీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షలు రాయకున్న, క్లాస్‌వర్క్ చేయకున్న మార్కులు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ప్రసన్నం చేసుకునే పనిలో ప్రైవేట్ యాజమాన్యాలు
బడికి రాని విద్యార్థుల వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందకు, విద్యార్థులకు పూర్తిస్థాయి మార్కులను అందించి ర్యాంకులు వక్రమార్గంలో అందించేందుకు పరీశీలనకు వచ్చే తనిఖీ బృందాలను ప్రసన్నం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సులభ మార్గంలో వచ్చే 120 మార్కులను సాధించడానికి ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ.. ఇన్నీ కావు. తనిఖీ బృందాలను పర్యవేక్షణ అనంతరం మరోసారి జిల్లా స్థాయి అధికారులు ఆకస్మికంగా స్కూళ్లను తనిఖీ చేస్తే మార్కుల వ్యవహారం వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.


