నాలుగు అంతస్తుల్లో కోర్టు సముదాయం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సకల వసతులతో కోర్టు భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. పాత కోర్టు స్థానంలోనే ఐదెకరాల్లో రూ.81.60కోట్లతో నాలుగు అంతస్తుల్లో నిర్మించనున్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించే భవనం పనులకు శనివారం శంకుస్థాపన జరగనుంది. ఈ భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతీ అంతస్తులో ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్‌తోపాటు 10+2 నిర్మాణ శైలితో రెండేళ్లలో భవనం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం
న్యాయస్థాన భవన సముదాయానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ మాట్లాడుతూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిశ్‌కుమార్‌సింగ్ వర్చువల్ విధానాల్లో శంకుస్థాపనలో పాల్గొంటున్నారని వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో న్యాయమూర్తులు బి.పుష్పలత, రాధిక జైస్వాల్, పి.లక్ష్మణాచారి, ఎ.ప్రవీణ్‌కుమార్, సిరిసిల్ల, వేములవాడ న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, సదానందం పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
సిరిసిల్ల: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జ్యోతి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జ్యోతి మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, విద్య, వైద్యం, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాలలో విశిష్టమైన సేవలను అందిస్తూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారన్నారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, ప్రధానోపాధ్యాయులు మాట్ల కుమార్ పాల్గొన్నారు.


