హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. నేటి నుంచే కేబీఆర్‌ చుట్టూ వన్‌వే! | Hyderabad Traffic Alert, KBR Park 360° One-Way Traffic Starts Today Amid H-CITI Works, Check More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. నేటి నుంచే కేబీఆర్‌ చుట్టూ వన్‌వే!

Aug 18 2026 6:59 AM | Updated on Aug 18 2026 11:08 AM

Hyderabad Traffic Alert: KBR Park Goes One Way From Today

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటి (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి 360 డిగ్రీల వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుంది. ‘హెచ్‌–సిటీ’ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో చేపడుతున్న ఈ ట్రాఫిక్‌ మార్పులు దాదాపు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి. వాహనదారులు కొత్త మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గూగుల్‌ మ్యాప్స్‌, నావిగేషన్‌ రూట్లలో అవసరమైన అప్‌డేట్లు చేశారు. వన్‌వే అమలును పర్యవేక్షించేందుకు 450 మంది ట్రాఫిక్‌ సిబ్బందిని మోహరించనున్నారు. కీలక ప్రాంతాల్లో 24 గంటలూ ట్రాఫిక్‌, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు.

వన్‌వే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారులు ఏర్పాటు చేసిన సైనేజ్‌ బోర్డులను గమనిస్తూ నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలి. అవసరమైన చోట్ల మాత్రమే లేన్‌ మార్చుకోవాలని పోలీసులు సూచించారు.

13 లైన్‌ ఛేంజర్లు.. 10 ఎగ్జిట్లు
వాహనదారులకు మార్గమధ్యలో ఇబ్బందులు లేకుండా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ 13 లైన్‌ ఛేంజర్లు, 10 ఎగ్జిట్‌లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్‌ మార్కింగ్స్‌, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల కదలికలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్‌ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు.

రెండుసార్లు పైలట్‌ ట్రయల్స్‌ తర్వాతే..
వన్‌వే విధానాన్ని అమలు చేయడానికి ముందు రెండుసార్లు పైలట్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రయల్స్‌లో ఎదురైన సమస్యలు, ట్రాఫిక్‌ కదలికలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసిన అనంతరం ఆగస్టు 18 నుంచి వన్‌వేను అమలు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు కీలక ప్రాంతాల్లో 24/7 ట్రాఫిక్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

రాంగ్‌రూట్‌పై కఠిన చర్యలు
వన్‌వే నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్‌సైడ్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. నిర్ణయించిన మార్గాలు, ఫ్రీ-లెఫ్ట్‌ సదుపాయాలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్‌ తక్కువగా ఉందని అతివేగంగా ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరించారు.

వాకర్స్‌, విజిటర్స్‌కు ప్రత్యేక పార్కింగ్‌
కేబీఆర్‌ పార్క్‌కు వచ్చే వాకర్స్‌, విజిటర్స్‌ కోసం ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్క్‌ పరిసరాల్లో వన్‌వే కారణంగా ఏర్పడే మార్పులను ముందుగానే తెలుసుకుని ప్రయాణం చేసుకోవాలని అధికారులు సూచించారు.

హెచ్‌–సిటీ పూర్తయితే ట్రాఫిక్‌కు భారీ ఊరట
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపట్టనున్న హెచ్‌–సిటీ ప్రాజెక్టులో భాగంగా భారీ స్థాయిలో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనులు పూర్తయితే కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్‌, రోడ్‌ నంబర్‌ 45, ఫిలింనగర్‌, అగ్రసేన్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్ల వద్ద ప్రయాణ ఇబ్బందులు 100 శాతం వరకు, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద 80 శాతం వరకు తగ్గుతాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

వాహనదారులు గుర్తుంచుకోవాల్సినవి

వన్‌వే ప్రారంభం: ఆగస్టు 18, ఉదయం 6 గంటల నుంచి
అమలు: సుమారు రెండేళ్లు
విధానం: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ 360 డిగ్రీల వన్‌వే
లైన్‌ ఛేంజర్లు: 13
ఎగ్జిట్లు: 10
ట్రాఫిక్‌ సిబ్బంది: 450 మంది
రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌పై: కఠిన చర్యలు
గూగుల్‌ మ్యాప్స్‌: కొత్త రూట్లకు అనుగుణంగా అప్‌డేట్‌

కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాన్ని ప్లాన్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement