
జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్న సీఎం
ఓఆర్‌ఆర్, కొండాపూర్ మధ్య సాఫీగా ప్రయాణం
గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్
సాక్షి,హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) నుంచి కొండాపూర్ వరకు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ప్రయాణించే వారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. శిల్పా లేఔట్ రెండో ఫేజ్ ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. దీంతో నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యం కలగనుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.
ఇదీ ప్రాజెక్ట్
ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద రూ.178 కోట్లతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఆరు లేన్లతో ఉన్న దీని పొడవు 1.2 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. ఇప్పటికే గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2గా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. త్వరితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
ఎస్సార్‌డీపీ (SRDP) కింద నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇది 23వది. ఈ ఫ్లై ఓవర్‌ను త్వరితగతిన పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపుతున్న కమిషనర్ కర్ణన్ దీంతోపాటు ఫలక్‌నుమా, శాస్త్రిపురంల ఆర్‌ఓబీలు సైతం త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. ఈ రెండు ఆర్‌ఓబీలతో ఎస్సార్‌డీపీ కింద చేపట్టిన పనులు 39 పూర్తవుతాయి.
హై సిటీగా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాజెక్టుల పనులను హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కింద చేస్తున్నారు. దీని ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో కొత్తగా 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, 4 ఆర్‌ఓబీలు, 3 ఆర్‌యూబీలతోపాటు పది మార్గాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులున్నాయి. వీటిల్లో కొన్ని పనుల్ని వచ్చే నెలలో చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ (GHMC) పేర్కొంది.
చదవండి: ఫతేనగర్ వంతెన మెట్ల కూల్చివేత