
28 నెలల్లో 656 రోడ్డు ప్రమాదాలు
126 మంది దుర్మరణం, 504 మందికి గాయాలు
అత్యధికంగా హైదరాబాద్‌లో 291 యాక్సిడెంట్లు
సైబరాబాద్‌లో 228; రాచకొండలో 137 ప్రమాదాలు
సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లు డెత్ జోన్‌లుగా మారుతున్నాయి. వాహనదారుల ప్రయాణ సమయాన్ని తగ్గించే పైవంతెనలు ప్రాణాలను తీసే ప్రమాదకారకాలుగా మారుతున్నాయి. 2023 జనవరి నుంచి 2025 మే మధ్య 28 నెలల కాలంలో గ్రేటర్‌లోని ఫ్లైఓవర్లపై 656 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో 126 మంది మృత్యువాత పడ్డారు. 504 మందికి గాయాలయ్యాయి.
ఇంజినీరింగ్ లోపాలతో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70కు పైగా ఫ్లైఓవర్లు (flyovers) ఉన్నాయి. రద్దీ లేని సమయాల్లో పైవంతెనలపై వాహనాల వేగం పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ.. ఫ్లైఓవర్లపై సరైన వీధిలైట్లు లేకపోవడం, రంబుల్డ్ స్ట్రిప్స్, బాటిల్ నెక్, వంపులు ఎక్కువగా ఉండటం వంటి ఇంజినీరింగ్ లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. అతివేగం, లైన్ క్రమశిక్షణ లేకపోవడం, పరధ్యానంలో వాహనాలు నడపటం వంటివి కూడా కారణాలేనని పేర్కొంటున్నారు.
సీసీటీవీ కెమెరాలెక్కడ?
ఫ్లైఓవర్లపై సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదాల కారణాలను విశ్లేషించలేకపోతున్నామని, కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సీసీటీవీ కెమెరాలు (CC Cameras) లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందో నిర్ధారించడం, ఎవరి తప్పు అనేది తేల్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. వాహనం డ్యామేజ్, రోడ్డు స్కిడ్ అయిన తీరు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, క్షతగాత్రులకు గాయాలైన తీరు వంటి సంప్రదాయ పద్ధతులపై ఆధారపడాల్సి వస్తోంది.
2019లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై జరిగిన ఘోరమైన కారు ప్రమాద సమయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు హడావుడి చేశారు. ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనదారుల భద్రత దృష్ట్యా ఫ్లైఓవర్లపై సీసీటీవీ కెమెరాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అత్యధికంగా సిటీ కమిషనరేట్‌లో..
గ్రేటర్‌లోని మూడు పోలీసు కమిషనరేట్లలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లై ఓవర్లపై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిటీ పరిధిలో 291 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 46 మంది మరణించగా, 234 మంది గాయాలపాలయ్యారు. సైబరాబాద్‌లో జరిగిన 228 ప్రమాదాల్లో 54 మంది మృత్యువాత పడగా, 162 మంది గాయపడ్డారు. రాచకొండలో జరిగిన 137 ప్రమాదాల్లో 26 మంది మరణించగా, 107 మందికి గాయాలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి నుంచి మే మధ్యకాలంలో సైబరాబాద్‌లో 56, హైదరాబాద్‌లో 49, రాచకొండలో 22 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
చదవండి: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్