హైద‌రాబాద్ వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌ | Hyderabad No Parking Fines to directly send to home | Sakshi
Sakshi News home page

Hyderabad: అక్రమ పార్కింగ్‌ చేస్తే ఇంటికే చలాన్‌!

Jul 11 2025 7:26 PM | Updated on Jul 11 2025 7:55 PM

Hyderabad No Parking Fines to directly send to home

అందుబాటులోకి రానున్న స్మార్ట్‌ పార్కింగ్‌లు

సర్కిల్‌కు 30 చొప్పున ఏర్పాటు..

ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధిలో మొదలైన ప్రక్రియ

గంటకు రూ.25 చొప్పున వసూలు

హైద‌రాబాద్‌: రోడ్ల పక్కన స్థలం ఖాళీగా ఉంది కదా అని.. జీహెచ్‌ఎంసీ పార్కుల ముందు పార్కింగ్‌ సదుపాయం ఉంది కదా..! అని ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్‌ చేసి వెళ్తే జీహెచ్‌ఎంసీ ఇంటికే చలాన్లు పంపిస్తుంది. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, ఫట్‌పాత్‌లపై, పార్కు ల పక్కన అక్రమంగా వాహనాలు పార్కింగ్‌ చేస్తూ జారుకుంటే జీహెచ్‌ఎంసీ (GHMC) ఇక నుంచి చూస్తూ ఊరుకోదు. ఇందుకోసం స్మార్ట్‌ పార్కింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తుంది. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధి కిందికి వచ్చే ఖైరతాబాద్‌ సర్కిల్‌–17, జూబ్లీహిల్స్‌ సర్కిల్‌–18, గోషామహల్, కార్వాన్, మెహిదీపట్నం తదితర ఐదు సర్కిళ్ల పరిధిలో స్మార్ట్‌ పార్కింగ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది.

30 చోట్ల ఏర్పాటు  
ఒక్కో సర్కిల్‌ పరిధిలో 30 చోట్ల స్మార్ట్‌ పార్కింగ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సింగపూర్‌ సిటీ తరహా ఇక్కడ కూడా స్మార్ట్‌ పార్కింగ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా ఇందుకోసం అనుభవం ఉన్న రెండ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఈ రెండు ఏజెన్సీలు ఖైరతాబాద్‌లోని జోనల్‌ కార్యాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా స్మార్ట్‌ పార్కింగ్‌లు ఎలా ఉండబోతున్నాయో, ఛార్జీలు ఎలా వసూలు చేస్తారో, చలానాలు ఎలా పంపిస్తారో అధికారులకు వివరించాయి.

ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్‌ఈ రత్నాకర్, ఐటీ జాయింట్‌ కమిషనర్, ఆయా సర్కిళ్ల ఇంజినీర్లతో సమావేశమై స్మార్ట్‌ పార్కింగ్‌ వల్ల ప్రయోజనాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ (SR Nagar) ప్రధాన రోడ్డులో గంటల తరబడి అక్రమ పార్కింగ్‌ల చేయడం వల్ల ఏర్పడుతున్న నష్టాలను చర్చించారు. ఈ జాతీయ రహదారిలో ఫుట్‌పాత్‌లతో పాటు రోడ్ల పక్కన, జీహెచ్‌ఎంసీ ఖాళీ స్థలాల్లో అక్రమ పార్కింగ్‌లు చేయడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నట్ల గుర్తించారు.

సమయాన్ని బట్టి చార్జీలు..  
జీహెచ్‌ఎంసీ గుర్తించిన 30 స్మార్ట్‌ పార్కింగ్‌లలో వాహనాలు పార్కింగ్‌ చేసే వారి నుంచి గంటకు రూ.25 చొప్పున వసూలు చేస్తారు. వాహనం నెంబర్‌ ఆధారంగా ఇంటికే చలానా వెళ్తుంది. సదరు వాహనదారుడు ఆన్‌లైన్‌లో ఛార్జీలు చెల్లించుకోవడానికి అవకాశం క‌ల్పించారు. సంబంధిత ఏజెన్సీలు తమకు అనుసంధానమై ఉన్న స్మార్ట్‌ పార్కింగ్‌ యాప్‌ ద్వారా ఏ వాహనం ఎక్కడ పార్కింగ్‌ చేసి ఉందో గుర్తించి సమయాన్ని బట్టి ఛార్జీలు పంపిస్తారు. స్మార్ట్‌ పార్కింగ్స్‌లో సోలార్‌ ప్యానెళ్ల ద్వారా ఎలక్ట్రిక్‌ ఛార్జీంగ్‌ పాయింట్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. సీసీ కెమెరాలు (CC Cameras) కూడా ఏర్పాటు చేస్తారు.

చ‌ద‌వండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభ‌వం మీకు ఎదురైందా? 

అక్రమంగా పార్కింగ్‌ చేసిన వారికి ఆన్‌లైన్‌లో చలానాలు పంపించనున్నారు. కొన్నిచోట్ల రోడ్ల పక్కన ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాల్లో కూడా జీహెచ్‌ఎంసీ అద్దెకు తీసుకుని స్మార్ట్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేయనుంది. వసూలు చేసిన ఛార్జీల్లోనే ప్రైవేటు వ్యక్తులకు అద్దెలు చెల్లిస్తారు. ఒక వాహనం ఏ సమయం నుంచి ఏ సమయం దాకా పార్కింగ్‌ చేశారో ఏఐ ద్వారా తెలుసుకోనున్నారు. సదరు ఏజెన్సీలే ఈ పార్కింగ్‌ను నిర్వహించనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement