మెట్రోలో ఇలాంటి అనుభ‌వం మీకు ఎదురైందా? | Mobile Screen Newsense Impact In Hyderabad Metro, Check Out Reasons And Other Details For This Bad Trend | Sakshi
Sakshi News home page

మెట్రో రైల్లో ఇలాంటివి ఫేస్ చేశారా?

Jul 10 2025 7:30 PM | Updated on Jul 10 2025 7:59 PM

mobile screen newsense impact in Hyderabad metro

అన్ని ప్రదేశాల్లో మొబైల్‌ సౌండ్‌ పొల్యూషన్‌

అత్యధికంగా పెరిగిన మొబైల్‌ స్క్రీన్‌ వాచింగ్‌

కనీస బాధ్యత, పరివర్తన అవసరమంటున్న నగరవాసులు

ఈ నిర్లక్ష్యపు ట్రెండ్‌ ‘స్క్రీన్‌ న్యూసెన్స్‌’పై విమర్శలు

ప్రస్తుత తరుణంలో మొబైల్‌ వినియోగం పెరిగిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్, సోషల్‌ మీడియా, ముఖ్యంగా రీల్స్‌ వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్‌ అనేకన్నా దేహంలో ఒక భాగంగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. అయితే ఈ డిజిటల్‌ కల్చర్‌ ఇప్పుడు ప్రైవేటు స్పేస్‌ నుంచి బహిరంగ ప్రదేశాల్లోనూ విస్తరిస్తూ, ఇతరులకు అసౌకర్యం కలిగించే స్థితికి చేరింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ రీల్స్‌ వంటి షార్ట్‌ వీడియోలు చూస్తూ ప్రజలు అందులో మునిగిపోతున్నారు. ఇది వారి వ్యక్తిగత విషయంగా అనిపించినా, పబ్లిక్‌ ప్రదేశాల్లో హెడ్‌సెట్‌ లేకుండా పెద్ద సౌండ్‌తో వీడియోలు చూడటం వల్ల అది చుట్టుపక్కల వారికి న్యూసెన్స్‌గా మారుతోంది. వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఈ నిర్లక్ష్యం మానసిక, సామాజిక ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.  – సాక్షి, సిటీబ్యూరో

టెక్నాలజీ అనేది మనకు ఓ వరం. కానీ దాని వాడకంలో బాధ్యత లేకపోతే అదే వరం నాశనానికి దారి తీస్తుంది. మొబైల్‌ మన జీవితంలో భాగం కావొచ్చు కానీ అది ఇతరుల జీవన శైలిని దెబ్బతీయకుండా ఉండాలంటే మనకు ఒక పరిమితి, పరిపక్వత, పరివర్తన అవసరం. మొబైల్‌ వినియోగంలో మైండ్‌ఫుల్‌నెస్‌ (mindfulness) కలిగి ఉండటం కాలానుగుణంగా మారిన అవసరం. అంతే కాదు, అది మనిషిగా మన విలువల్ని చూపించే మోడరన్‌ మెచ్యూరిటీ కూడా. తోటివారి మనస్థితిని పట్టించుకోకుండా వారి అశాంతికి కారణమవ్వడం నిర్లక్ష్యమే కాదు.. వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే.

మెట్రోలో మొబైల్‌ మ్యూజిక్‌ షో! 
ప్రధానంగా హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. వర్కింగ్‌ క్లాస్, విద్యార్థులు, వృద్ధులు ప్రయాణించే మెట్రోలో కొంతమంది యువత రీల్స్‌ చేస్తూ చుట్టుపక్కల వారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ఉద్యోగాల ఒత్తిడి నుంచి అలసిపోయిన ప్రయాణికులు విశ్రాంతి కోరుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న వారు పెద్దగా ఫోన్‌ సౌండ్‌తో వీడియోలు చూడటం, గేమ్స్‌ ఆడటం వల్ల వారి మానసిక ప్రశాంతత దెబ్బతింటోంది. సింపుల్‌గా ఒక హియర్‌ఫోన్స్‌/హెడ్‌సెట్‌ పెట్టుకుంటే సరిపోతుంది అనే పరివర్తన అవసరం. హెడ్‌సెట్‌ (headset) పెట్టుకున్నవారితో మరో సమస్య.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మెట్రో డోర్‌కు అడ్డంగా నిలబడటం, దారి మధ్యలో ఎటూ పోకుండా ఇబ్బంది కలిగించడం వంటి సమస్యలు సృష్టిస్తున్నారు.

పరిష్కార మార్గాలు.. 
అవగాహన కార్యక్రమాలు: ప్రభుత్వం, టెక్‌ కంపెనీలు, మున్సిపాలిటీలు కలిసి ‘మైండ్‌ఫుల్‌ మొబైల్‌ యూజ్‌’ గురించి అవగాహన పెంచాలి. 
సైలెంట్‌ జోన్లు: మెట్రోల్లో, హాస్పిటల్స్‌లో, దేవాలయాల్లో మొబైల్‌ సైలెన్స్‌ జోన్లను స్పష్టంగా సూచిస్తూ బోర్డులు పెట్టాలి. 
యాప్స్‌తో నియంత్రణ: కొంతమంది యూజర్లు తమ మొబైల్‌ యూజ్‌ను ట్రాక్‌ చేసి నియంత్రించడానికి ‘స్క్రీన్‌ టైమ్‌’, ‘ఫోకస్‌ మోడ్‌’ వంటి ఫీచర్లను వినియోగించవచ్చు. 
స్వీయ నియంత్రణ: అన్నింటికన్నా ప్రధానమైంది స్వీయ నియంత్రణ.. ప్రతి ఒక్కరూ తమ వినియోగాన్ని బాధ్యతగా మలుచుకోవాలి. అది మన సమాజానికి, తనకు తాను ఇచ్చే గౌరవం కూడా.

ప్రభావాలు.. 
మానసిక అసౌకర్యం: 
నిర్లక్ష్యంగా వినిపించే సౌండ్‌లు ఇతరులను డిస్టర్బ్‌ చేస్తాయి. ఇది ప్రత్యేకించి చదువుకునే విద్యార్థులు, శారీరకంగా అలసిపోయిన ఉద్యోగులు, మానసికంగా టెన్షన్‌లో ఉన్నవారికి తీవ్రంగా నష్టాన్ని, విరక్తిని కలిగిస్తుంది.

పరిసరాల పట్ల బాధ్యత కోల్పోవడం: 
దేవాలయాల్లో, ఆసుపత్రుల్లో, థియేటర్లలో మానవీయ బాధ్యత లేకుండా మొబైల్‌ వాడకం వల్ల సామాజిక విలువలు మసకబారుతున్నాయి.

సామాజిక దూరం: 
ఒకే ప్రదేశంలో ఉన్నా, తన ఫోన్‌లో మునిగిపోయే వ్యక్తి చుట్టూ ఉన్నవారితో కనెక్షన్‌ కోల్పోతాడు. దీని వల్ల సంబంధాలు బలహీనపడతాయి.

ఈ నిర్లక్ష్యపు కల్చర్‌కి కారణాలు 
స్వీయ నియంత్రణ లోపం: 
వ్యక్తిగత ప్రపంచం నుంచి పబ్లిక్‌ స్పేస్‌లోకి వస్తున్నామంటే కొన్ని నైతిక విలువలు ఉంటాయనే స్పృహ కలిగి ఉండాలి. మన నిర్లక్ష్యం ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించినా వ్యక్తిగా విలువ కోల్పోవడమే. 

డిజిటల్‌ డోపమైన్‌: 
రీల్స్, షార్ట్‌ ఫార్మ్‌ కంటెంట్‌ మానసికంగా వినోదం కలిగించడంతో పాటు డోపమైన్‌ (dopamine) విడుదలకు కారణమవుతుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు స్క్రీన్‌కి ఆకర్షితులవుతారు. ఎంత సమయం వారు అందులో మునిగిపోయారో వారికే తెలీదు. అలాంటిది ఇతరుల ఇబ్బందులను ఎలా గుర్తించగలుగుతారు. 

నివేదికలు లేకపోవడం: 
పబ్లిక్‌ ప్లేస్‌లలో మొబైల్‌ వినియోగంపై కచ్చితమైన నియమాలు లేకపోవడం కూడా ఈ అలవాట్లను పెంచుతోంది. 

సామాజిక అవగాహన లోపం: ఇతరుల మనస్థితిని అర్థం చేసుకోకుండానే వ్యక్తిగత వినోదం కోసం మిగతావారిని అసౌకర్యానికి గురిచేస్తున్నారు.

చ‌ద‌వండి: కాసేపు టెక్నాల‌జీకి బ్రేక్ ఇద్దామా? 

పబ్లిక్‌ స్పేస్‌లోనూ.. 
హాస్పిటల్స్, రెస్టారెంట్లు, దేవాలయాలు, పార్కులు, థియేటర్లు, ఫంక్షన్‌ హాల్స్‌.. ఇవన్నీ ప్రజలకు ఆరోగ్యం, మానసిక విశ్రాంతి, భక్తి, ఆనందం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగపడే ప్రదేశాలు. కానీ ఇక్కడ సైతం మొబైల్‌ స్క్రీన్‌ కల్చర్‌ తలెత్తుతోంది. రెస్టారెంట్‌లో ఆర్డర్‌ వచ్చే వరకు ఫోన్‌ స్క్రోల్‌ చేయడం, ఆలయంలో మంత్రాల మధ్యలో రింగ్‌టోన్లు వినిపించడం, మరీ ముఖ్యంగా హాస్పిటల్‌ వార్డుల్లో రీల్స్‌ ప్లే అవడం వంటి ఘటనలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement