
ఫోన్ లేదు, ల్యాప్‌టాప్ లేదు, గాడ్జెట్‌లు లేవు.. ప్రశాంతతను ఆస్వాదిస్తూ కామ్‌గా తోచిన పని చేసుకుంటూ.. తలచుకుంటేనే ఓహ్ అనిపిస్తోంది కదా.. ప్రస్తుతం నగరంలో కొందరు అనుసరిస్తున్న మార్గం ఇదే.. డిజిటల్ డిటాక్స్. ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్యమైన భాగం అయినప్పుడు నడిపించే అవయవాల్లో ఒకటిగా మారిపోయినప్పుడు.. డిజిటల్ డిటాక్స్ ఖచ్చితంగా చాలా కష్టమైన పని అనేది నిస్సందేహం. అయితే అది అందించే ప్రయోజనాలు ఇతర మార్గాల ద్వారా అసాధ్యం అనేది కూడా నిర్వివాదమే.
‘గాడ్జెట్‌లు, స్క్రీన్స్ లేదా ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్ణిత సమయం వరకు ఉపయోగించకుండా ఉండటమే.. డిజిటల్ డిటాక్స్’ అని గేట్‌వే ఆఫ్ హీలింగ్ వ్యవస్థాపకులు, మానసిక వైద్యులు డాక్టర్ చాందిని నిర్వచిస్తారు. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, రీసెట్ చేయడానికి మధ్యన సాగే ఒక సంక్లిష్టమైన అభ్యాసం. సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోషల్ మీడియా ఇమెయిల్స్ నుంచి డిస్‌కనెక్ట్, అలాగే ఆఫ్‌లైన్ ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఉద్ధేశించింది అంటున్నారామె. అధిక డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చే మానసిక అలసటను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.
ప్రయోజనాలెన్నో..
శారీరక, మానసిక ఆరోగ్యంపై డిజిటల్ డిటాక్స్ సానుకూల ప్రభావాలను చూపుతుందంటున్న క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ దినిక ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్‌లో ఎంత సమయం గడుపుతున్నారనే దానిపై ఆధారపడి డిజిటల్ డిటాక్స్ నిర్దిష్ట ప్రయోజనాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు’ అంటున్నారు.
అయితే డిజిటల్ డిటాక్స్ మనకు చాలా సమయాన్ని తిరిగి ఇస్తుంది. నిర్ణిత వ్యవధిలో సమాచారం నోటిఫికేషన్స్ సహా డిజిటల్ దాడి నుంచి రక్షిస్తుంది’ అంటారామె. డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలను ఢిల్లీకి చెందిన ప్రముఖ మనస్తత్వవేత్త కౌన్సిలర్ డాక్టర్ షీనా సూద్ ఇలా వివరిస్తున్నారు.
డిజిటల్ డిటాక్స్ సాధ్యమేనా?
‘స్టోర్లలో ఫోన్లతో చెల్లింపులు, ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్‌లతో పనిపాటలు, యాప్‌ల ద్వారా సంప్రదింపులు.. కోవిడ్ తర్వాత సమూలమైన జీవిత–సాంకేతికత కనెక్షన్ ఏర్పడింది. సాంకేతికతపై పూర్తిగా ఆధారపడే నేటి ప్రపంచంలో, డిజిటల్ డిటాక్స్ హడావుడిగా ప్రారంభిస్తే గందరగోళం ఏర్పడవచ్చు. సో, చిన్నగా ప్రారంభించవచ్చు. ముందస్తుగా ఒక వారం కాకపోయినా, ఒక రోజుతోనైనా మొదలు పెట్టవచ్చు అంటున్నారు సైకాలజిస్ట్‌లు.
‘డిటాక్స్’ సక్సెస్ కావాలంటే..
కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు సహా సంప్రదించాల్సిన వారందరికీ నిర్ణయాన్ని తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ సంప్రదింపు మార్గాల్ని సిద్ధం చేయాలి.
డిజిటల్ కమ్యూనికేషన్ లేదా యాక్సెస్ అవసరమయ్యే వ్యాపార లేదా వ్యక్తిగత విధులు ఉంటే, వేరొకరికి కేటాయించడం లేదా డిటాక్స్ తర్వాత రోజులకి వాయిదా వేయాలి.
డిజిటల్ కమ్యూనికేషన్‌కు అందుబాటులోకి వచ్చే సమయం గురించి తెలిపే ఆటోమేటిక్ ఇమెయిల్ వాయిస్‌మెయిల్ ప్రత్యుత్తరాలను సెటప్ చేయాలి.
డిజిటల్ గాడ్జెట్‌ల వైపు ప్రలోభాలను నివారించడానికి, ఆసక్తికరమైన ఆఫ్‌లైన్ కార్యకలాపాలు, అభిరుచులు, విహారయాత్రలను ప్లాన్ చేసుకోవాలి.
ఉచిత వైఫై ఉన్న కేఫ్‌లు లేదా టీవీ స్క్రీన్‌లతో కూడిన పబ్లిక్ ప్రాంతాలు వంటి డిజిటల్ వైపు నడిపించే ప్రదేశాలు లేదా పరిస్థితులను నివారించాలి.
ప్రోత్సహించడానికి ఉత్సాహంగా ఉంచడానికి స్వల్ప వ్యవధుల్లో డీటాక్స్‌కు సంబంధించి సక్సెస్ పారీ్టలను జరుపుకోవచ్చు.
కొత్త విశేషాలను కోల్పోతామనే భయంతో ఫోన్లకు అతుక్కుపోవడం ఆహారం, వ్యాయామం, నిద్ర షెడ్యూల్‌పై ప్రభావం చూపుతోంది. డిజిటల్ డిటాక్స్ ఆరోగ్యకరమైన అలవాట్లను పునరుద్ధరిస్తుంది.
గాడ్జెట్‌లు విడుదల చేసే రివార్డ్ హార్మోన్ డోపమైన్ మంచి అనుభూతిని ఇవ్వడంతో దాన్ని పదేపదే కోరుకుంటాం. అయితే ప్రతి స్క్రోల్ మన మెదడులోని అదే ప్రాంతాలలో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి హానికరమైన పదార్థాలకు ప్రతిస్పందిస్తాయి. డిజిటల్ డిటాక్స్ మనం ఈ వ్యసనం వలలో పడకుండా సహాయపడుతుంది.
అవాంఛనీయ ప్రమాణాలను నిర్ణయించుకోడానికి, అనారోగ్యకరమైన ఎక్స్‌పోజర్‌లకు దారి తీసే సోషల్ మీడియాతో తెగతెంపులు మన స్వీయ– ఇమేజ్‌ను పునరుద్ధరించడానికి, నిజమైన స్వభావాన్ని అంగీకరించడానికి మనకు అవకాశం లభిస్తుంది.
డిజిటల్ పరికరాలు
విడుదల చేసే నీలి కాంతి శరీరపు సాధారణ నిద్ర–మేల్కొలుపు చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. నిద్ర నాణ్యత కోల్పోయేలా చేస్తుంది. డిజిటల్ డిటాక్స్‌తో ప్రశాంతమైన నిద్ర సాధ్యం. గార్డెనింగ్, బుక్ రీడింగ్.. వంటి ఆరోగ్యకర అభిరుచులను తిరిగి తెస్తుంది.
(చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..)