ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం.. | Malayalam Film Sthanarthi Sreekuttan Inspires No More Back benchers | Sakshi
Sakshi News home page

ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..

Jul 10 2025 10:58 AM | Updated on Jul 10 2025 1:46 PM

Malayalam Film Sthanarthi Sreekuttan Inspires No More Back benchers

క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్‌ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్‌బెంచ్‌లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్‌బెంచ్‌లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్‌’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. 

కొల్లం జిల్లాలోని ఆర్‌.వి.వి. సెకండరీ హయ్యర్‌స్కూల్‌కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్‌... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. 

గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్‌లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్‌ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్‌ ఎందుకు?

ఆ సినిమా కథ ఏమిటి?
కె.ఆర్‌.నారాయణన్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్‌ సి సెక్షన్‌లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్‌’. శ్రీకుట్టన్‌ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్‌. వీళ్లంతా అల్లరి గ్యాంగ్‌ అని క్లాస్‌లో ఫ్రంట్‌ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. 

వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్‌ స్కూల్‌ ఎలక్షన్‌లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్‌ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్‌ విశ్వనాథ్‌ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.

1996లో కేంద్రం చెప్పినా...
క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్‌ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. 

వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది.      

(చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!              )        
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement