
వధూవరులు లేని పెళ్లి గురించి విన్నారా? అసలు అలాంటి పెళ్లి అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా!సూటిగా మ్యాటర్‌లోకి వస్తే... ‘ఫేక్ వెడ్డింగ్’ అనేది యువతరంలో ఒక ట్రెండ్‌గా మారింది.
మెట్రో సిటీస్‌లో ఎక్కువగా జరిగే ఈ ఉత్తుత్తి వివాహ వేడుకల్లో బ్యాండ్ బాజాలు ఉంటాయి. అతిథులు ఉంటారు. ఘన స్వాగతాలు ఉంటాయి. దండలు మార్చుకోవడాలు (మాక్) ఉంటాయి. పురోహితుడి వేదమంత్రాలు ఉంటాయి.అయితే వధూవరులు మాత్రం ఉండరు.
ఢిల్లీ, బెంగళూరు, పుణేలలో ఈ ట్రెండ్ ఊపు అందుకుంటుంది. కాలేజి క్యాంపస్‌లలో, రూఫ్‌టాప్ బార్‌లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఫేక్ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవు. అయిదు వందల నుంచి మూడు వేల వరకు ప్రవేశ రుసుము ఉంటుంది.
సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే ఈ లోకల్ ట్రెండ్ కాస్త దేశ సరిహద్దులు దాటింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్‌పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆహా’ అని కొందరు ఆకాశానికి ఎత్తుతుండగా...‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు.