ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం అవిహితమ్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు అన్నది నాటి నానుడైతే అనుమానమొచ్చినా ఆనందమొచ్చినా ఆపుకోలేరన్నది నేటి మాట. అనుమానమొస్తే మాత్రం అది తెలుసుకునేంతవరకు నిద్రపట్టదు కొందరికి. తమకు సగమే తెలిసిన గోరంత విషయాన్ని కొండంత చేసి, అవతలి వాళ్ళలో అనుమానపు బీజాలు నాటే బడా బాబులు చాలామందే ఉంటారు. మరీ ముఖ్యంగా ఇలాంటివాళ్ళ వల్లే పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల గాలివార్తలకు కొదవ లేకుండా పోతుంది. వాళ్ళను దృష్టిలో ఉంచుకుని రాసిన కథే ఈ ‘అవిహితమ్’. వైవిధ్యానికి పెద్ద పీట వేసుకుంటూ తమ ప్రేక్షక పరిధిని ఈ ఓటీటీ కాలంలో పెంచుకుంటూ పోతున్న మలయాళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన మరో మణిమాణిక్యమే ఈ ‘అవిహితమ్’. ఇది నిజంగా హాస్యప్రియమ్ అని చెప్పాలి. చిన్న పాయింట్‌తో దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకుడిని కదలకుండా కట్టిపడేశారు ఈ సినిమా దర్శకుడు సెన్నా హెగ్డే. ఈ ‘అవిహితమ్’లో అంతలా ఏముందో ఓసారి చూద్దాం.
అది ఓ మారుమూల పల్లెటూరు. ప్రకాశన్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో మందు పార్టీ ముగించుకుని తన ఇంటికి వెళ్ళబోతుండగా దొంగతనంగా సన్నిహితంగా ఉన్న ఓ జంటను వడ్రంగి మాధవన్ ఇంటి పరిసరాల్లో చూసి అవాక్కవుతాడు. ఆ జంట ప్రతి రోజూ ఓ సమయంలో కలవడంతో పాటు ఆ జంటలో మాధవన్ వదిన నిర్మల ఉందన్న విషయాన్ని గుర్తుపట్టి, ఇదే విషయాన్ని ఊళ్ళో కాస్త పెద్ద తరహాగా వ్యవహరించే టైలర్ వేణన్నకు చెబుతాడు ప్రకాశన్.
మాధవన్‌కు ఈ విషయాన్ని ఆ వేణన్న చేరవేస్తాడు. మాధవన్ ఈ విషయాన్ని తన తండ్రికి, అలాగే తన సోదరుడు ముకుందన్‌కు చెబుతాడు. అలా మెల్లమెల్లగా ఊరంతా ఈ విషయం పాకి పోతుంది. ఆ జంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఊరంతా ఏకమై ఓ పెద్ద ఆపరేషనే చేపడతారు. మరి... ఈ ఆపరేషన్‌లో ఆ జంట దొరికిపోతుందా? దొరికిన తరువాత మాధవన్ కుటుంబంతో పాటు ఊరి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని ‘అవిహితమ్’లోనే చూడాలి.
ఈ సినిమా మొత్తం ఓ అనుమానంతో ప్రారంభమైతే చూసే ప్రేక్షకులకు కూడా ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలనే తపన అంతకంతకూ పెరుగుతుంది. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ ‘అవిహితమ్’ హాస్యప్రియమ్ కాబట్టి ఇది ప్రేక్షకప్రియమ్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.
– హరికృష్ణ ఇంటూరు


