
అత్యధిక సైబర్ నేరాల కేసులు బెంగళూరులోనే
ఆ తర్వాత స్థానంలో నిలిచిన హైదరాబాద్
2023 గణాంకాలను వెల్లడించిన ఎన్సీఆర్బీ
ఆధారాలు లేక మూతపడుతున్నవే అధికం
భాగ్య నగరంలో సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతున్నాయా..? ఈ–కేటుగాళ్లకు హైదరాబాద్ సాఫ్ట్ టార్గెట్‌గా మారుతోందా..? ఔననే అంటున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వర్గాలు. 2023కు సంబంధించిన డేటాను ఎన్సీఆర్బీ (NCRB) మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం సైబర్ నేరాల నమోదులో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2023లో 4,855 కేసులు నమోదయ్యాయి. 17,631 కేసులతో మొదటి స్థానంలో బెంగళూరు ఉండగా.. 4,131 కేసులతో ముంబై మూడో స్థానంలో ఉంది. 2022లో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ (Hyderabad) ఏడాదిలోనే రెండో స్థానానికి వెళ్లింది.
బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కేసులే అత్యధికం..
హైదరాబాద్‌లో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సంబంధిత మోసాల కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. 2,858 సంఖ్యతో మొత్తం కేసుల్లో 58.86 శాతం ఇవే ఉన్నట్లు ఎన్సీఆర్బీ స్పష్టం చేస్తోంది. బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేసే సైబర్ నేరగాళ్లు వినియోగదారులను నిండా ముంచుతున్నారు.
బ్యాంకు ఖాతాల వివరాలు అప్‌డేట్ చేయాలని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) తప్పనిసరి అంటూ నమ్మిస్తున్నారు. ఈ పేర్లతో వినియోగదారుల నుంచి బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత వివరాలు, వన్ టైమ్ పాస్‌వర్డ్స్ (ఓటీపీ) సంగ్రహిస్తున్నారు. వీటిని వినియోగించి ఎదుటి వారి ఖాతాలను గుల్ల చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఏటీఎం కార్డులు, కేంద్రాలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. 2023లో నగర వ్యాప్తంగా ఈ తరహా కేసులు 211 నమోదయ్యాయి.
‘క్లూ’ దొరకని కేసులే అధికం..
ఈ సైబర్ నేరాల్లో (Cyber Crimes) బాధితులు మోసపోవడం ఎంత తేలికో.. కేసు కొలిక్కి రావడం, నగదు రికవరీ అంత కష్టం. అత్యధిక కేసుల్లో దర్యాప్తు ముందుకు వెళ్లడానికి కనీసం ఒక్క ఆధారం కూడా దొరకదు. ఈ సైబర్ నేరగాళ్లు నేరాలు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు తమ పేర్లు, వివరాలతో లేకుండా నేరం చేస్తారు. వీళ్లు వినియోగించే ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్ కూడా దర్యాప్తు సంస్థలకు తెలియకుండా ఉండేందుకు ప్రాక్సీ సర్వర్లు వినియోగిస్తారు.

కొందరు పాత్రధారుల, దళారులు మినహా సూత్రధారులు అంతా విదేశాల్లోనే తిష్ట వేస్తుంటారు. అక్కడి వివరాలు సేకరించడానికి ఇక్కడి పోలీసులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఈ కారణంగానే అత్యధిక కేసుల్లో ఆధారాలు సేకరించడం పోలీసులకు సాధ్యం కావట్లేదు. దీంతో బాధితుడు మోసపోవడం, నష్టపోవడం నిజమైనప్పటికీ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. 2023లో నగరంలో నమోదైన 4,855 కేసుల్లో 2733 (56.29 శాతం) ఆధారాలు లేకపోవడంతో క్లోజ్ అయ్యాయి.
ప్రతి ఫిర్యాదునూ నమోదు చేస్తున్నాం
భవిష్యత్తులో సైబర్ నేరాలు, ఉగ్రవాదమే పెను సవాల్‌గా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదు చేస్తున్నాం. ఆర్థిక సంబంధిత నేరాల్లో రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన కేసులను సైబర్ క్రైమ్ ఠాణాలో, మిగిలిన వాటిని స్థానిక పోలీసుస్టేషన్లలో రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయిస్తున్నాం. కొన్ని సున్నితమైన కేసుల్లో ఒకప్పుడు బాధితులు.. ప్రధానంగా మహిళలు బయటకు వచ్చి ఫిర్యాదు చేసేవాళ్లు కాదు. ఇటీవల కాలంలో అవగాహన పెరిగిన కారణంగా ఈ పరిస్థితి లేదు. దీంతో ప్రతి ఏడాది నగరంలో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలేజీలు, స్కూళ్ల వరకు వెళ్తున్నాం.
– నగర పోలీసు అధికారి