హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తకరారు! | Hyderabad, Cyberabad, Rachakonda Police Commissionerates Last Updates | Sakshi
Sakshi News home page

పోలీసు కమిషనరేట్ల తకరారు!

Jun 23 2026 8:02 PM | Updated on Jun 23 2026 8:11 PM

Hyderabad, Cyberabad, Rachakonda Police Commissionerates Last Updates

అసంపూర్తిగా ‘పోలీస్‌’ పునర్‌ వ్యవస్థీకరణ

ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ గందరగోళంగానే.. 

సిబ్బంది, సరిహద్దులపై కొలిక్కిరాని కమిటీ కసరత్తు 

ఇటీవల ఎస్‌ఐల బదిలీలతో తెరపైకి వచ్చిన వ్యవహారం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్వవస్థీకరిచడంతో పాటు కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటైంది. రాచకొండ పేరును మల్కాజ్‌గిరిగా మార్చిన డీజీపీ కార్యాలయం.. నాలుగు కమిషనరేట్లకు అధిపతుల్ని నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ప్రక్రియ జరగ్గా ఇప్పటికీ అంతా గందరగోళంగానే ఉంది. ఈ కాలంలో మల్కాజ్‌గిరికి రెండో పోలీసు కమిషనర్‌ కూడా వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ చేపట్టిన సబ్‌–ఇన్‌స్పెక్టర్ల బదిలీల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  

తాత్కాలికంగా ఎక్కడి వారు అక్కడే అంటూ... 
పునర్వ్యవస్థీకరణలో భాగంగా మల్కాజ్‌గిరిగా మారిన రాచకొండ నుంచి ఐదు పోలీసుస్టేషన్లు హైదరాబాద్‌లో కలవగా..నగరం నుంచి తొమ్మిది ఠాణాలు అక్కడకు వెళ్లాయి. అప్పట్లో డీజీపీ కార్యాలయం ఎక్కడి సిబ్బంది అక్కడే పని చేసేలా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ తొమ్మిది ఠాణాల్లోని ఇన్‌స్పెక్టర్ల నుంచి హోంగార్డుల వరకు మల్కాజ్‌గిరిలోనే పని చేస్తున్నారు. ఈ రెండే కాదు.. అన్ని నాలుగు కమిషనరేట్లలోనూ జరిగిన మార్పుచేర్పులతో ఎక్కడి సిబ్బంది అక్కడే తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ సిబ్బందితో పాటు సరిహద్దులను పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిర్దేశించడానికి ఉద్దేశించిన కమిటీ అధ్యయనం పూర్తి కాకపోవడంతో తుది ఉత్తర్వులు వెలువడలేదు.

ఈ రెండింటి మధ్యే అసలు ఇబ్బంది... 
రాజధానిలోని మిగిలిన కమిషనరేట్ల విషయం అంటుంచితే... హైదరాబాద్‌–మల్కాజ్‌గిరి మధ్యే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రెండు కమిషనరేట్ల మధ్య పోలీసుస్టేషన్ల మార్పిడి జరిగినప్పటికీ సిబ్బంది పంపకం విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్ చార్మినార్‌ జోన్‌లోకి, మల్కాజ్‌గిరి యాదాద్రి జోన్‌లోకి వస్తాయి. దీంతో ఒక కమిషనరేట్‌ సిబ్బంది మరో కమిషనరేట్‌లోకి మారాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాల్సిందే. ఇవి జారీ అవ్వాలంటే నాలుగు కమిషనరేట్ల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం పూర్తయి..కీలక సిఫార్సులు ప్రభుత్వానికి చేరాలి.

వీళ్లు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో.. 
ఈ పరిణామంతో ఆ తొమ్మిది ఠాణాల్లో పని చేస్తున్న దాదాపు 600 మంది సందిగ్ధంలో  పడ్డారు. తమకు పరిపాలన పరమైన ఇబ్బందులు ఉన్నా... బదిలీ అవసరమైనా... ఇతర సమస్యలు వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది అంతుచిక్కట్లేదని వాపోతున్నారు. తాము సాంకేతికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన వారమని... తాత్కాలిక ప్రాతిపదికన మల్కాజ్‌గిరిలో పని చేస్తుండటంతో ఈ ఇబ్బంది వస్తోందని చెప్తున్నారు. కమిటీ వీలున్నంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

చ‌ద‌వండి: హెచ్‌ఎండీఏ భూముల వేలం.. కనీస ధర గజానికి  రూ.50 వేలు

బదిలీల సమస్య ఏమిటంటే..? 
హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని వివిధ పోలీసుస్టేషన్లలో సుదీర్ఘకాలంలో పని చేస్తున్న ఎస్‌ఐల జాబితాను ఇటీవల ఉన్నతాధికారులు రూపొందించారు. శాశ్వత కేటాయింపులు జరగకపోవడంతో మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో కలిసిన తొమ్మిది ఠాణాల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలూ ఈ జాబితాలోకి వచ్చాయి. దీంతో ఆయా పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 20 మంది ఎస్‌ఐలను వేరే ఠాణాలు, విభాగాలకు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ కమిషనర్‌ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఠాణాలు సాంకేతికంగా మల్కాజ్‌గిరి కమిషనర్ ఆధీనంలో ఉండటంతో ఈ తొమ్మిది ఠాణాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్స్‌ ఆగాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement