సొరంగంలో నడుస్తూ.. చేపలను చూస్తూ! | Hyderabad City to Host One of India Largest Aquariums at Nehru Zoological Park | Sakshi
Sakshi News home page

సొరంగంలో నడుస్తూ.. చేపలను చూస్తూ!

Jun 8 2025 5:56 AM | Updated on Jun 8 2025 5:56 AM

Hyderabad City to Host One of India Largest Aquariums at Nehru Zoological Park

నెహ్రూ జూపార్క్‌లో అతిపెద్ద టన్నెల్‌ అక్వేరియం నిర్మాణానికి ప్రణాళిక

ఎకరం స్థలంలో ఏర్పాటుకు కసరత్తు

ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో రూ. 50 కోట్ల వ్యయంతో నిర్మాణం

షార్క్, స్టింగ్‌ రే, లయన్‌ ఫిష్‌ సహా 100కుపైగా చేపల రకాల దిగుమతి

సాక్షి, హైదరాబాద్‌/బహదూర్‌పురా: గాజు తొట్టెల్లో రంగురంగుల చేపలు కనిపిస్తే ఎవరైనా భలే ఉన్నాయని ముచ్చటపడతారు.. చిన్నారులైతే ఎగిరి గంతేస్తారు. అలాంటిది మనమే ఓ భారీ గాజు తొట్టె లోపల నడుస్తూ ఇరువైపులా వింత ఆకారాల్లో, వివిధ సైజుల్లో ఉండే చేపలను చూస్తే..! ఆ అనుభూతే వేరు కదూ. హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు విచ్చేసే సందర్శకులకు త్వరలోనే ఈ అనుభూతి కలగనుంది. జూపార్క్‌లోని ఎకరం స్థలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద టన్నెల్‌ అక్వేరియం నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే జూ బోర్డు అనుమతి పొందిన ఈ ప్రాజెక్టుకు రూ. 50 కోట్ల నిర్మాణ వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. గుజరాత్‌లోని అక్వాటిక్‌ గ్యాలరీ, కేరళలోని మెరైన్‌ వరల్డ్‌ మాదిరిగా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు.

2026 నాటికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌..
ప్రస్తుతం బహదూర్‌పురాలోని జూపార్క్‌లో మంచినీటి, సముద్ర జలచరాలతో కూడిన 15 చిన్న అక్వేరియంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి సమీపంలోనే ప్రతిపాదిత అక్వేరియాన్ని సుమారు 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. గుజరాత్‌లోని అక్వాటిక్‌ గ్యాలరీ తరహాలో సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2026 నాటికి మాస్టర్‌ ప్లాన్‌ పూర్తవుతుంది. సింగపూర్, ఆస్ట్రేలియాకు చెందిన బహుళజాతి సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

వందలాది చేపల రకాలు..
సందర్శకులు నడవడానికి వీలుగా ఉండేలా సొరంగ శైలిలో అక్వేరియం నిర్మాణం ఉంటుంది. ఇందులో ఆసియా, ఆఫ్రికా, అమెరికా తదితర దేశాల నుంచి స్టింగ్‌ రే, స్టార్‌ ఫిష్, లయన్‌ ఫిష్, షార్క్‌ వంటి 100కుపైగా చేపల రకాలను దిగుమతి చేసుకొని అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం జూపార్క్‌కు సగటున రోజుకు 30 వేల మంది సందర్శకులు వస్తుండగా అక్వేరియం అందుబాటులోకి వస్తే రోజుకు 50 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర జూ అథారిటీ అనుమతులే తరువాయి..
ప్రస్తుత జూపార్క్‌ను, పక్కనే ఉన్న మీరాలం చెరువు సుందరీకరణ పనులతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. అందులో భాగంగా పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. అక్వేరియం నిర్మాణానికి కేంద్ర జూ అథారిటీ అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలుపెడతాం. – డాక్టర్‌ సునీల్‌ ఎస్‌. హీరేమత్, డైరెక్టర్, రాష్ట్ర జూపార్క్‌లు

పులితో సెల్ఫీ..
గుజరాత్‌లోని వన్‌తార వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మాదిరిగా.. మన జూపార్క్‌లోనూ టైగర్‌ గ్లాస్‌ ఎన్‌క్లోజర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ ఎన్‌క్లోజర్‌ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే జూబోర్డు రూ. 1.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సందర్శకులు పులులను దగ్గరగా చూడటానికి వీలు కల్పించే విధంగా 50 మీటర్ల వెడల్సాటి గాజు ఎన్‌క్లోజర్‌ ఉంటుంది. సందర్శకులు పులులను దగ్గరగా చూస్తూ ఎంచక్కా సెల్ఫీ దిగొచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే సింహం, చిరుత బోన్‌లకు కూడా గ్లాస్‌ ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement