సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏడాది మే నెలాఖరులో పెద్దపల్లి జిల్లాలో ఏకంగా 47.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదవగా.. ఈసారి మే మొదటివారంలోనే దానికి సమీపానికి చేరింది. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అదే విధంగా జగిత్యాల జిల్లా గొదురులో 46.8, అల్లీపూర్‌లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ విభాగం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఎండల వేడి తార స్థాయికి చేరడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరో రెండు రోజులు ఇలాగే.. వానలకూ చాన్స్
రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇలాగే ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని.. వడగాడ్పులు తీవ్రంగా వీచే అవకాశమూ ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతున్నా.. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వెల్లడించింది.
మంగళ, బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. వర్షాలకు సంబంధించి.. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
May 6 2024 5:37 AM | Updated on May 7 2024 10:36 AM
Advertisement


