తెలంగాణలో కుండపోత.. ​కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు | Three Days Heavy Rain Forecast To Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కుండపోత.. ​కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Jul 30 2026 7:10 AM | Updated on Jul 30 2026 8:56 AM

Three Days Heavy Rain Forecast To Telangana

సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

heavy rains in hyderabad latest news20

అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత రెండు రోజులుగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తాజా వాతావరణ పరిస్థితుల ప్రకారం ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు, రేపు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే.. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో పాటు రాబోయే మూడు గంటల పాటు చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

heavy rains in hyderabad latest news20

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement