ఇళ్ల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రక్షాళన! | House registrations suspended if there is no occupancy certificate | Sakshi
Sakshi News home page

ఇళ్ల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రక్షాళన!

Oct 4 2026 4:30 AM | Updated on Oct 4 2026 4:30 AM

House registrations suspended if there is no occupancy certificate

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకపోతే రిజిస్ట్రేషన్ల నిలిపివేత 

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు‘క్యూర్‌’డిజిటల్‌ నెట్‌వర్క్‌ అనుసంధానం 

ఆటోమేటిక్‌ వెరిఫికేషన్‌తో అక్రమాలకు చెక్‌ 

ఎఫ్‌టీఎల్, సెక్షన్  22–ఏ నిషేధిత ఆస్తుల నమోదు పూర్తిగా నిలిపివేత 

చట్టవిరుద్ధ నిర్మాణాల బదిలీకిఈ చట్టంతో చెక్‌

సాక్షి, హైదరాబాద్‌: క్యూర్‌’చట్టం అమల్లోకి రావడంతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగనుంది. దశాబ్దాలుగా అనుమతుల్లేని ఆస్తుల విక్రయాలతో నష్టపోతున్న సామాన్య గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తూనే, చట్టవిరుద్ధ నిర్మాణాల బదిలీకి ఈ చట్టం చెక్‌ పెట్టనుంది.అనుమతి ఉన్న ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ ఆటంకాలు ఎదురైతే మాత్రం పరిష్కారం కోసం ప్రత్యేక సమస్యల పరిష్కార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. సబ్‌–రిజి్రస్టార్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకత పెంచేందుకు ప్రత్యేక డిజిటల్‌ వేదికను రూపొందించింది. 

రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే, సదరు గృహం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి పొందిందో? లేదో? సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌లోనే స్కాన్‌ అవుతుంది. సబ్‌–రిజిస్ట్రార్‌ ఆఫీసులను క్యూర్‌ పోర్టల్‌తో అనుసంధానించడం ద్వారా స్లాట్‌ బుకింగ్, వెరిఫికేషన్, నాలా భూమార్పిడి రుసుముల చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. దీనివల్ల కొనుగోలుదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు దళారీల ప్రమేయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరి  
క్యూర్‌ పరిధిలో భవన నిర్మాణ నిబంధనలు పాటించని ఇళ్లకు క్యూర్‌ చట్టం ద్వారా కఠినమైన నిబంధనలు అమలు కానున్నాయి. ఇకపై కొత్తగా నిర్మించిన, విక్రయించే ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉండటం తప్పనిసరి. అనుమతులు లేని, అనుమతి పొందిన లేఅవుట్‌ ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్తుల అక్రమ నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ పరిధిలో రిజిస్ట్రేషన్లతో పాటు టైటిల్‌ బదిలీలను పూర్తిగా నిషేధించారు. 

ఓసీ(ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌) లేని భవనాలకు విద్యుత్, తాగునీటి సరఫరా కనెక్షన్లు కూడా నిలిచిపోనుంది. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై 300 శాతం వరకు జరిమానాలు విధించేలా అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు చందానగర్‌లో అనుమతి లేని లేఅవుట్‌లో ఐదో అంతస్తులో ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌ చెల్లించిన కొనుగోలుదారుడికి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ జరిగేది. కానీ కొత్త ’క్యూర్‌’విధానంలో బిల్డర్‌ ఓసీ పత్రాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయకపోతే, సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ను బ్లాక్‌ చేస్తుంది.  

ఆటోమ్యాపింగ్‌ 
క్యూర్‌ పరిధిలోని చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలోని ఇళ్లతో పాటు, రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్‌ 22ఏ పరిధిలోకి వచ్చే నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇకపై ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి. ‘హైడ్రా’గుర్తించిన నిషేధిత భూముల విశ్లేషణ డేటాను రిజిస్ట్రేషన్‌శాఖ సాఫ్ట్‌వేర్‌కు ఆటో మ్యాపింగ్‌ ప్రక్రియ కానుంది. అనుమతి లేని సర్వే నంబర్లు క్యూర్‌ డిజిటల్‌ నెట్‌వర్క్‌లో రెడ్‌ఫ్లాగ్‌ అవ్వడంవల్ల అక్రమ ఆస్తుల దస్తావేజులు సబ్‌ రిజిస్ట్రార్‌ లాగిన్‌లోనే ఆటోమేటిక్‌గా తిరస్కరణకు గురవుతాయి. 

ఈ చట్టం అమలుతో దస్తావేజుల్లో నమోదు చేసే ఆస్తి విలువను దాచే ప్రయత్నాలకు ఇది చెక్‌ పెడుతుంది. మరోవైపు సక్రమమైన అనుమతులు ఉన్నప్పటికీ సాంకేతిక లోపాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతే, కొనుగోలుదారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అప్పిలేట్‌ అథారిటీని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement